ఎకరం అమ్మినా అప్పులు తీరకపోవడంతో..
కూలీ ఆత్మహత్య
దుబ్బాకరూరల్: అప్పుల బాధ తాళలేక కూలీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని ఆకారం గ్రామంలో జరిగింది. సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన డప్పు చంద్రం(50) కూలీ పని చేస్తూ కుటుంబంతో కలిసి జీవనం కొనసాగిస్తున్నాడు. గతంలో కుటుంబ అవసరాల కోసం కొన్ని అప్పులు చేశాడు. ఈ క్రమంలో ఎకరం భూమి అమ్మి కొన్ని అప్పులు తీర్చాడు. ఇంకా కొన్ని అప్పులు ఉండటంతో తనలో తానే తీవ్రంగా ఆలోచిస్తూ బాధపడుతుండేవాడు. మనస్తాపానికి గురై శనివారం రాత్రి గ్రామ శివారులోని చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ఆదివారం ఉదయం గమనించిన స్థానికులు, కుటుంబీకులు, పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృత దేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


