కొండెక్కిన ‘కోడిగుడ్డు’
సామాన్యుడిపై భారం అల్పాహారం, పోషకాహారంగా వినియోగం
జోగిపేట(అందోల్): కార్తీక మాసం పూర్తికాగానే గుడ్ల ధర మార్కెట్‌లో ఒక్కసారిగా పెరిగింది. రోజువారీ వినియోగంలో ప్రముఖమైన గుడ్డు, ఇప్పుడు సామాన్యుడికి భారంగా మారింది. జిల్లాలో గత వారం వరకు రూ.5.50 నుంచి రూ.6 వద్ద ఉన్న గుడ్డు ధర ఇప్పుడు రూ.7 దాటింది. కొన్ని చోట్ల అయితే రూ.7.50 లకు విక్రయాలు జరుగుతున్నాయి. కార్తీకంలో డిమాండ్ తగ్గగా, మాసం పూర్తయ్యాక డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో ధరలు అలానే పెరిగిపోయాయి. పౌల్ట్రీ ఫీడ్ ధరలు పెరగడం కూడా గుడ్ల రేటు పెరుగుదలకు మరో కారణమని పేర్కొంటున్నారు. రవాణా ఖర్చులు పెరగడం, ఉత్పత్తి తగ్గడం వంటి అంశాలు కూడా ప్రభా వం చూపుతున్నాయి. చలికాలం మొదలవడంతో గుడ్ల వినియోగం సహజంగానే పెరుగుతుంది. మార్కెట్‌లో సరఫరా డిమాండ్‌లో తేడా కారణంగా ధరలు మరో వారం రోజులు ఇలాగే ఉండే అవకాశం కనిపిస్తోంది. పేద, మధ్య తరగతి కుటుంబాలు ఈ పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్నాయి. రోజూవారీ హోటళ్లు, టిఫిన్ సెంటర్లు కూడా గుడ్డు వంటకాల ధరలను పెంచే ఆలోచనలో ఉన్నాయి. అల్పాహారం, పోషకాహారంగా గుడ్లను వినియోగించే ప్రజలు ధరలు తగ్గించాలని కోరుతున్నారు. గుడ్ల ధరల పెరుగుదలపై మార్కెట్ అధికారులు సమీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉందని వినియోగదారు లు వాపోతున్నారు. రేట్లు నియంత్రణలోకి రావాలంటే ప్రభుత్వం జోక్యం అవసరమని అభిప్రాయపడుతున్నారు.
మరింత పెరిగే అవకాశం..
ప్రస్తుతం డజను కోడిగుడ్లు ధర రూ.84. కూరగాయల ధరలు అధికంగా ఉన్నప్పుడు కోడిగుడ్లతో సరిపెట్టుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కి ఇప్పుడు ధరలు పెరగడంతో భారమయ్యా యి. కూరగాయలతో పోటీపడి మరీ కోడిగుడ్ల ధర అమాంతం పెరగటం చూస్తుంటే.. మరో నెల, రెండు నెలల్లో డజను వందదాటే అవకాశం ఉంది. చలికాలంలో ఎగ్స్ ధరలు పెరగడం సాధారణమేనని కొందరు వ్యాపారులు చెబుతున్నారు. కానీ కొన్నేండ్లుగా ఇంత పెద్ద ఎత్తున పెరగలేదని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. మరో వారం పది రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. పౌష్టికాహారమని, రోజూ తినాలని డాక్టర్లు సూచిస్తుండటంతో వీటి వినియోగం పెరిగింది. కోడిగుడ్డును ప్రజలు తమ రోజువారీ మెనూలో ఆహారంగా తీసుకుంటున్నారు.
ప్రస్తుతం డజను గుడ్ల ధర రూ.84
ధర పెరిగింది
కొడిగుడ్డు ధరలు ఒకేసారి పెరిగాయి. మొన్నటి వరకు గుడ్డుకు రూ.5 చొప్పున ఉండగా ఒకేసారి 6.50కి పెరిగింది. మేము హోల్‌సేల్‌గా విక్రయిస్తున్నాం. చిన్న చిన్న షాపుల్లో రూ.7 నుంచి రూ.7.50కు విక్రయిస్తున్నారు. మరింతగా పెరిగే అవకాశం ఉంది. గుడ్ల క్రయ, విక్రయాలు తగ్గలేదు.
– శేఖర్, వ్యాపారస్తుడు, జోగిపేట


