అమ్మా.. నన్ను కొడుతున్నార ని ఫోన్
యువకుడి అనుమానాస్పద మృతి
ములుగు(గజ్వేల్): అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై రఘుపతి కథనం మేరకు.. బస్వాపూర్ గ్రామానికి చెందిన నర్సంపల్లి రేణుక, రవి దంపతులకు కార్తీక్, సందీప్(21) ఇద్దరు కుమారులున్నారు. కాగా గతంలో తండ్రి రవి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సందీప్ తుర్కపల్లిలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే ఈ నెల 22న ఉదయం డ్యూటీకి వెళ్లి సాయంత్రం 4 గంటలకు ఇంటికి వచ్చాడు. తరువాత కొత్తూరులో హెయిర్ కటింగ్ చేయించుకుని వస్తానని ఇంట్లో చెప్పి బైక్‌పై వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో తల్లి సందీప్‌కు ఫోన్ చేస్తే ఇంకా కటింగ్ చేయించుకోలేదని తెలిపాడు. తర్వాత రాత్రి 9.30 గంటలకు తల్లి మళ్లీ ఫోన్ చేస్తే అమ్మా నన్ను కొడుతున్నారంటూ ఫోన్ కట్‌చేశాడు. తిరిగి రాత్రి 10 గంటలకు సందీప్ తల్లికి ఫోన్ చేసి కొత్తూరులోని పెద్దమ్మ గుడి వెనుకాల మధు, నందు, అరుణ్, అనీల్ కొడుతున్నారని చెప్పాడు. వెంటనే కుటుంబీకులు గుడివద్దకు చేరుకుని వెతికినా కనిపించలేదు. పలుమార్లు ఫోన్ చేసినా అతను ఫోన్ ఎత్తలేదు. ఈ క్రమంలో కొత్తూరు దాటిన తర్వాత రోడ్డు పక్కన గల ట్రాన్స్‌ఫార్మర్ వద్ద తీవ్ర రక్త గాయాలై సందీప్ మృతి చెంది ఉన్నాడు. తన కుమారుడు మృతిపట్ల అనుమానం ఉందంటూ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.


