
జీపీఓలు వస్తున్నారు!
● ఉమ్మడి జిల్లాకు 482 మంది ఎంపిక ● నేడు సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు
జిల్లా క్లస్టర్లు జీపీఓలు
సిద్దిపేట 246 150
మెదక్ 185 113
సంగారెడ్డి 325 209
సాక్షి, సిద్దిపేట: గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా గ్రామ పాలనాధికారులను(జీపీఓ)లను నియమిస్తోంది. వీఆర్‌ఏ, వీఆర్‌ఓ వ్యవస్థలను 2022లో రద్దు చేసి అర్హత ఆధారంగా పలు శాఖలలో వివిధ పోస్టులలో భర్తీ చేశారు. అనంతరం ఆసక్తి ఉన్న పూర్వ వీఆర్‌ఏ, వీఆర్‌ఓల నుంచి దరఖాస్తులను స్వీకరించి అర్హత పరీక్ష నిర్వహించి ఎంపిక చేశారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 482 మంది ఎంపికవ్వగా.. వీరందరూ మాదాపూర్‌లోని హైటెక్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా శుక్రవారం నియామకపత్రాలు అందుకోనున్నారు.
756 క్లస్టర్లుగా విభజన
దాదాపు 5వేల ఎకరాల భూ విస్తీర్ణం ప్రకారం క్లస్టర్లుగా విభజించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 756 క్లస్టర్లు ఉన్నాయి. ఒక్కో క్లస్టర్‌కు ఒక్కో జీపీఓను నియమించనున్నారు. ఈ క్రమంలోనే జిల్లా నుంచి 482 జీపీఓలుగా ఎంపికయ్యారు. సంగారెడ్డి జిల్లాలో 239 మంది జీపీఓలుగా ఎంపిక చేయగా.. 20 మంది మెదక్, మరో పది మందిని ఇతర జిల్లాలకు కేటాయించారు. సిద్దిపేట జిల్లాలో 146 మంది ఎంపికవ్వగా.. మరో నలుగురిని ఇతర జిల్లాల నుంచి కేటాయించారు. ఇక, ఉమ్మడి మెదక్‌లో 274 క్లస్టర్లకు ఖాళీలుండనున్నాయి.
సంతోషంగా ఉంది
మా మాతృ శాఖకు తిరిగి వెళ్లడం సంతోషంగా ఉంది. మూడేళ్లు ఇతర శాఖలో పని చేసిన సర్వీ స్, రెవెన్యూలో చేసిన పాత సర్వీస్‌ను సైతం పరిగణలోకి తీసుకోవాలి. పాత సర్వీస్‌ను ఫారెన్ సర్వీస్‌గా పరిగణించి పదోన్నతులు, సర్వీస్‌ల్లో కలపాలి. – వేణు, మెదక్
అన్ని ఏర్పాట్లు చేశాం
జీపీఓ నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి అందజేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులను తరలించేందుకు మూడు ప్రత్యేక బస్సులను సిద్ధం చేశాం. ఈ కార్యక్రమానికి తరలించేందుకు పది మంది అధికారులను నియమించాం.
– అబ్దుల్ హమీద్, అదనపు కలెక్టర్, సిద్దిపేట

జీపీఓలు వస్తున్నారు!

జీపీఓలు వస్తున్నారు!