
పోరాటాన్ని వక్రీకరిస్తే చరిత్ర క్షమించదు
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు అబ్బాస్
చేర్యాల(సిద్దిపేట): ఆనాడు దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన రైతాంగ సాయుద పోరాట వారసులే కమ్యూనిస్టులని, అలాంటి పోరాటాలను వక్రీకరిస్తే చరిత్ర క్షమించదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ అబ్బాస్ అన్నారు. గురువారం స్థానిక భద్రకాళి పంక్షన్ హల్‌లో చేర్యాల పట్టణ, రూరల్ మండల, కొమురవెల్లి, మద్దూరు, దూల్మిట్ట మండలాల కార్యకర్తల రాజకీయ శిక్షణ తరగతులు జరిగాయి. ఈ తరగతులకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ‘కమ్యూనిస్టు ఉద్యమ విశిష్టత–పార్టీ నిర్మాణం’పై బోధించారు. జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీన తెలంగాణ రైతాంగ సాయుద పోరాట బైరాన్‌పల్లి అమరుల సంస్మరణ సభ బైరాన్‌పల్లిలో జరుగుతుందన్నారు. ఈ సభకు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్క రాములు హాజరవుతారన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చేర్యాల నుంచి బైరాన్‌పల్లి వరకు బైక్‌ర్యాలీ ఉంటుందన్నారు. శిక్షణ తరగతులకు జిల్లా కమిటీ సభ్యుడు కొంగరి వెంకట్‌మావో ప్రిన్సిపల్‌గా వ్యవహరించగా.. నాయకులు యాదవరెడ్డి, శశిదర్, యాదగిరి, అరుణ్, కృష్ణారెడ్డి, కుమార్, రవీందర్, షపీ, ప్రశాంత్, నాగరాజు, రాజు, శోభ, ఇస్తారీ, శ్రీహరి పాల్గొన్నారు.