
పేదల నమ్మకాన్ని వమ్ము చేయొద్దు
● కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగాసేవలందించాలి
● మంత్రి దామోదర రాజనర్సింహ
సంగారెడ్డి: పేదల నమ్మకాన్ని వమ్ము చేయొద్దని, కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలందించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో క్రిటికల్ కేర్ బ్లాక్, మెడికల్ కాలేజీ, హాస్టల్స్‌ను ప్రారంభించారు. అలాగే 500 పడకల సామర్థ్యం గల నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మెడికల్ కళాశాల విద్యార్థులతో ముఖాముఖీ నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నాణ్యమైన వైద్య విద్యను అందించేందుకు ప్రభుత్వం ఎన్ని కోట్లయి నా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించి గుర్తింపు పొందాలని విద్యార్థులకు సూచించారు. సీఎస్‌ఆర్ నిధులను మౌలిక వసతుల మెరుగు కోసం ఉపయోగించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడుతూ.. యువ డాక్టర్లు అందరూ రాజకీయాల్లోకి రావాలని, విద్యావంతులు వస్తే దేశం మరింత పురోగతి చెందుతుందన్నారు. కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా, కలెక్టర్ ప్రావీణ్య, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలారెడ్డి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, ఎమ్మెల్యేలు సంజీవరెడ్డి, మాణిక్‌రావు, ప్రిన్సిపాల్ ప్రకాశ్‌రావు, వైద్య కళాశాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
విద్యారంగానికి పెద్దపీట
జోగిపేట(అందోల్): విద్యాసంస్థల్లో మున్సిపల్‌శాఖ భాగస్వామ్యం అవసరమని మంత్రి దామోదర రా జనర్సింహ అన్నారు. గురువారం నియోజకవర్గంలోని అందోలు, చౌటకూరు మండలాల్లో రూ. 31.24 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అందోల్ నియోజకవర్గంలో విద్యా ప్రగతికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. మున్సిపల్ సిబ్బంది సహకారంతో విద్యాసంస్థల్లో శానిటేషన్ సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ ఇళ్లను మంత్రి ఘనంగా ప్రారంభించారు.