
కళాకారుడిగా రంగులద్ది.. గురువుగా మెరుగులు దిద్ది
పాపన్నపేట(మెదక్): ఆటపాటలతో విద్యార్థులను అక్కున చేర్చుకుంటూ.. వినూత్న బోధనలతో ఆకట్టుకుంటూ.. చిన్నారుల భవితకు బంగారు బాటలు వేస్తున్నారు ఉపాధ్యాయుడు ఆశన్నగారి మల్లేశం. ఇతను మెదక్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం బస్వాపూర్ పాఠశాలలో 2012లో టీచర్ వృత్తిలోకి ప్రవేశించారు. విద్యార్థుల సంఖ్యను పెంచే ఉద్దేఽశ్యంతో గ్రామ సర్పంచ్‌తో మాట్లాడి మీ పిల్లల బాధ్యత మాది అంటూ భరోసా ఇచ్చి వారి పిల్లలను సర్కార్ బడిలో చేర్పించారు. దీంతో వెలవెలబోయిన పాఠశాల కొద్ది రోజుల్లోనే కళకళ లాడింది.
కుర్తివాడ బడి రూపురేఖలు మార్చి..
బదిలీపై కుర్తివాడ వచ్చిన ఆయన కొద్ది రోజుల్లోనే బడి రూపం మార్చారు. పాఠశాలకు పెయింటింగ్‌లతో కొత్త కళను తెచ్చారు. చాలా మంది తమ పిల్లలను సర్కార్ బడిలో చేర్పించారు. ఆటల్లో.. చదువుల్లో.. సాంస్కృతిక కార్యక్రమాల్లో.. మాకెవరు లేరు పోటీ అనేలా విద్యార్థులను తీర్చి దిద్దుతున్నారు మల్లేశం.