
ఖాళీ బిందెలతో నిరసన
కౌడిపల్లి(నర్సాపూర్): తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మండల పరిధిలోని ధర్మాసాగర్ గేట్ తండావాసులు సోమవారం జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తండాలో నాలుగు నెలలుగా తాగునీటి సమస్య ఉందని, పంచాయతీ కార్యదర్శికి పలుమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. కొంతకాలంగా మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో పాటు తండాలో సింగిల్ ఫేజ్ బోరుబావులు లేకపోవడంతో తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. నీటి కోసం వ్యవసాయ బోర్ల చుట్టూ తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తండాలో తాగునీటి సమస్య అధికమైందని, అధికారులు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి, సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని తండావాసులకు నచ్చజెప్పారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో తండావాసులు ధర్నా విరమించారు.
తాగునీటి కోసం రాస్తారోకో