ఆర్డీఎఫ్‌ పాఠశాలనుసందర్శించిన అమెరికా ప్రతినిధి | - | Sakshi
Sakshi News home page

ఆర్డీఎఫ్‌ పాఠశాలనుసందర్శించిన అమెరికా ప్రతినిధి

Aug 24 2025 9:53 AM | Updated on Aug 24 2025 2:14 PM

ఆర్డీఎఫ్‌ పాఠశాలనుసందర్శించిన అమెరికా ప్రతినిధి

ఆర్డీఎఫ్‌ పాఠశాలనుసందర్శించిన అమెరికా ప్రతినిధి

సిద్దిపేటరూరల్‌: నారాయణరావుపేట మండల పరిధిలోని మాటిండ్ల ఆర్డీఎఫ్‌ పాఠశాలను అమెరికాకు చెందిన దేసిఫార్కర్‌ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె పాఠ్య, సహాపాఠ్య, పాఠ్యేతర కార్యక్రమాలను తిలకించారు. ప్రపంచస్థాయి సమగ్ర విద్యను అందిస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. పాఠశాల కరెస్పాండెంట్‌ విష్ణుమూర్తి, ప్రధానోపాధ్యాయుడు బాపురెడ్డి పాల్గొన్నారు.

ఉచిత కోచింగ్‌

సిద్దిపేటఅర్బన్‌: సిద్దిపేట ఐటీ హబ్‌లోని టాస్క్‌ కార్యాలయంలో టెక్నికల్‌ కోర్సులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు మేనేజర్‌ నరేందర్‌గౌడ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కోర్సులు జావా, పైథాన్‌, వెబ్‌ డెవలప్‌మెంట్‌, డేటాబేస్‌, సుడో కోడ్‌, సీ, సీప్లస్‌ ప్లస్‌, హెచ్‌టీఎంఎల్‌, సీఎస్‌ఎస్‌, జావా స్క్రిప్ట్‌, ఆప్టిట్యూడ్‌ రీజనింగ్‌, సాఫ్ట్‌ స్కిల్స్‌పై శిక్షణ ఇవ్వనున్నారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసి, ఆసక్తి కలిగిన అభ్యర్థులు టాస్క్‌ కార్యాలయంలో ఈ నెల 25, 26 తేదీల్లో సంప్రదించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు.

ఏఐ అత్యంత ఆచరణీయం

మెదక్‌జోన్‌: ప్రభుత్వ పాలనా వ్యవస్థలో ఏఐ ప్రాధాన్యత అత్యంత ఆచరణీయమని కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు రోజులుగా ప్రభుత్వ పాలనా శాస్త్ర విభాగం, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్స్‌ రీసెర్చ్‌ , సదరన్‌ రీజియన్‌ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సదస్సు శనివారంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. అన్ని రంగాల్లో అనుసరిస్తున్న కృత్రిమ మేథ స్సు ఆవశ్యకతను వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ హుస్సేన్‌, ఆర్డీఓ రమాదేవి, సమన్వయకర్త సురేందర్‌రావు, అధ్యాపకులు డాక్టర్‌ శరత్‌రెడ్డి, తిరుమలరెడ్డి పాల్గొన్నారు.

పేకాట స్థావరంపై దాడి

దుబ్బాకరూరల్‌: పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన భూంపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం... మండలంలోని గ్రామ శివారులో కొంత మంది పేకాట ఆడుతున్నారని వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేశారు. వారి వద్ద నుంచి రూ.29,375 , 5 మొబైల్‌ ఫోన్లు, నాలుగు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నారు. పేకాట ఆడుతున్న వారు తాళ్లపల్లి, రుద్రారం గ్రామాలకు చెందిన వారిగా గుర్తించారు.

గంజాయి స్వాధీనం

మునిపల్లి(అందోల్‌): అరకిలో ఎండు గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. బుదేరా ఎస్‌ఐ రాజేశ్‌ నాయక్‌ వివరాల ప్రకారం... శనివారం ఉదయం కంకోల్‌ టోల్‌ ప్లాజా సమీపంలో కల్వకుర్తికి చెందిన మాడుగుల మారుతి, మరో బాలుడు కలిసి బీదర్‌ నుంచి గంజాయిని తీసుకొస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.

కార్మికుడికి గాయాలు

జిన్నారం (పటాన్‌చెరు): పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న కార్మికుడికి గాయాలయ్యాయి. ఈ ఘటన గడ్డపోతారం పారిశ్రామికవాడలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... ఎన్‌ మాక్స్‌ పరిశ్రమలో పనిచేసే సుధాకర్‌ విధులు నిర్వహిస్తుండగా క్రేన్‌ వెనుక నుంచి ఢీకొట్టడంతో కాలు విరిగి ప్రాణాలతో బయటపడ్డాడు. గాయాలైన కార్మికుడిని నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

అధికారులను తప్పుదోవ

పట్టించిన వారిపై కేసు

కొండపాక(గజ్వేల్‌): ప్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ను పొందడానికి అధికారులను తప్పుదోవ పట్టించిన ఐదుగురిపై కేసు నమోదైంది. కుకునూరుపల్లి ఎస్సై శ్రీనివాస్‌ కథనం ప్రకారం... తొగుట మండలంలోని గుడికందుల గ్రామానికి చెందిన ముండ్రాతి యాదయ్య ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ను కొండపాక మండల తహసీల్దార్‌ కార్యాలయం నుంచి పొందడానికి అధికారులను తప్పుదోవ పట్టించారు. వారిలో మండ్రాతి సరిత , రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ బాలకృష్ణ, దుద్దెడ పంచాయతీ కార్యదర్శి చక్రపాణి, సిద్దిపేటలోని పారిపల్లి వీధిలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న టి.శంకరయ్య, మద్దూర్‌ మండల తహసీల్దార్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న గౌరారం అనిత ఉన్నారు. మండ్రాతి అనిల్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

మద్యం లారీ బోల్తా

హుస్నాబాద్‌రూరల్‌: బీరు కాటన్‌లతో వెళుతున్న లారీ బోల్తాపడింది. మండలంలోని బంజేరుపల్లి క్రాసింగ్‌ వద్ద శనివారం సంగారెడ్డి నుంచి వరంగల్‌కు వెళుతున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. సమాచారం తెలుసుకున్న ఎకై ్సజ్‌ ఎస్సై రూప పంచనామా చేశారు. బోల్తా పడిన లారీలోని బీరు కాటన్స్‌ను మరో లారీలో లోడింగ్‌ చేసి పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement