
తాగునీటి తండ్లాట
ఐదు రోజులుగా సరఫరా బంద్
ఇబ్బందులు పడుతున్న ప్రజలు
ఖాళీ బిందెలతో ఎదురు చూపులు
హుస్నాబాద్: వర్షాకాలంలో కూడా ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మిషన్ భగీరథ నీరు సరఫరా నిలిచిపోవడంతో తల్లడిల్లుతున్నారు. మండలంలోని మహ్మదాపూర్‌లో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ గ్రిడ్ నుంచి రెండు పంపుల ద్వారా మున్సిపాలిటీతో పాటు పలు మండలాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. కానీ, ఐదు రోజుల నుంచి అక్కన్నపేట మండలంలోని 5 గ్రామాలు, భీమదేవరపల్లి మండలంలో 14 గ్రామాలతోపాటు మున్సిపాలిటీ, హుస్నాబాద్, కోహెడ, బెజ్జంకి, గన్నెరువరం, ఇల్లంతకుంట మండలాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. భగీరథ గ్రిడ్ నుంచి ప్రతి రోజు 330 లక్షల లీటర్ల (33 ఎంల్) నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. ఐదు రోజులుగా నీటిని నిలిపివేయడంతో ప్రజలు తాగునీటికి పడరాని పాట్లు పడుతున్నారు.
ప్రజల అవస్థలు
హుస్నాబాద్ మున్సిపాలిటీలో మున్సిపల్ అధికారులు ట్యాంకర్ల ద్వారా మూడు బిందెల చొప్పున ఇస్తున్న నీరు సరిపోవడం లేదని జనం గగ్గోలు పెడుతున్నారు. ట్యాంకర్ ఎప్పుడు వస్తోందో తెలియక పనులు విడిచిపెట్టి ఇంటి ముందు బిందెలు, ప్లాస్టిక్ డబ్బాలు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. పట్టణానికి మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లలో దాదాపు 200 కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరికి బోరు బావులు లేవు. భగీరథ నీళ్లు వస్తేనే దాహం తీరుతుంది. వారిని పట్టించుకునే నాఽథుడే కరువయ్యాడు. మున్సిపల్ అధికారులు ట్యాంకర్ ద్వారా సరఫరా చేస్తున్న నీరు సరిపోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సోమవారం లోగా సరఫరా చేస్తాం
మహ్మదాపూర్‌లోని మిషన్ భగీరథ సంపునకు సంబంధించి సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. సబ్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ప్యానల్ బోర్డు పూర్తిగా కాలిపోయింది. వాటి మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన చేయిస్తున్నాం. సోమవారం లోగా నీటి సరఫరాను పునరుద్ధరిస్తాం.
–రామ్‌కుమార్, ఈఈ,
గ్రిడ్ డివిజన్, హుజురాబాద్