
దొమ్మాటలో చిరుతపులి కలకలం
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
దౌల్తాబాద్(దుబ్బాక): మండలంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. వివరాలు.. దొమ్మాట అటవీ శివారులో చిరుత పులి సంచరిస్తుందంటూ గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేశారు. శనివారం గ్రామ శివారులోని పంట పొలాల్లో చిరుత కనిపించినట్లు గ్రామానికి చెందిన కొందరు యువకులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దుబ్బాక సెక్షన్ అధికారి మల్లేశంతోపాటు బీట్ ఆఫీసర్ మధులత దొమ్మాట అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. పరిసర ప్రాంతాలను పరిశీలించి పులి పాద ముద్రలు గుర్తించారు. చేగుంట మండలంలోని కొండాపూర్, ఉప్పర్‌పల్లి, అక్బర్‌పేట–భూంపల్లి మండలం అల్మాజీపూర్ లింగం చెరువు మీదుగా మండలంలోని దొమ్మాట అటవీ ప్రాంతానికి చిరుతపులి వెళ్లినట్లు పాదముద్రల ఆధారంగా నిర్ధారించారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. వ్యవసాయ పొలాల వద్ద పాడి పశువులు, గొర్రెలు, మేకలను ఉంచొద్దని, ఇండ్ల వద్ద కట్టేసుకోవాలని సూచించారు. అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాలు అమర్చామని, త్వరలో పట్టుకుంటామని అటవీ శాఖ అధికారులు తెలిపారు.

దొమ్మాటలో చిరుతపులి కలకలం