
ఇంటి తాళాలివ్వండి
డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఆందోళన
జహీరాబాద్ టౌన్: ఇచ్చిన గడువు ముగిసినందున డబుల్ బెడ్రూమ్ ఇళ్ల తాళాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం లబ్ధిదారులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. బీఆర్‌ఎస్ నాయకులు లబ్ధిదారులకు మద్దతుగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భగా మాజీ కౌన్సిలర్, బీఆర్‌ఎస్ నాయకులు నామ రవికిరణ్ మాట్లాడుతూ..బీఆర్‌ఎస్ ప్రభుత్వం హోతి(కె) వద్ద పేదల కోసం 660 ఇళ్లను కట్టించగా అధికారులు డ్రా ద్వారా లబ్ధిదారులకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారన్నారు. ఈ నెల 14న లబ్ధిదారులకు ఇళ్ల తాళాలను అందజేయగా పట్టాలు అందుకున్న మరో 132 మందికి విచారణ పేరుతో తాళాలు ఇవ్వడంలేదన్నారు. గతంలో ఎమ్మెల్యే మాణిక్‌రావు విజ్ఞప్తి మేరకు అధికారులు విచారణ చేపట్టి వారం రోజుల్లో తాళాలు ఇస్తారని ఎంపీ సురేశ్‌షెట్కార్ హామీ ఇచ్చారన్నారు. గడువు ముగిసినా తాళాలు ఇవ్వడంలేదని వాపోయారు. పట్టాలు అందుకున్న వారంతా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అర్హులేనని, దివ్యాంగులు కూడా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు స్పందించి వెంటనే తాళాలు ఇవ్వాలని కోరారు.