
కాలుష్యం కాటేసింది..!
తొగుట(దుబ్బాక): కలుషిత నీటితో చేపలు మృత్యువాత పడిన సంఘటన మండలంలోని వర్దరాజుపల్లిలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో గ్రామస్తులు వ్యతిరేకత వ్యక్తం చేసిన మున్సిపల్ అధికారులు పట్టించుకోకుండా గ్రామ శివారులోని గుట్టల మధ్యన సిద్దిపేట పట్టణ మున్సినపాలిటీ చెత్తయార్డు ఏర్పాటు చేశారు. అయితే అప్పటి నుంచి చెత్తతో పాటు పట్టణంలోని ఆస్పత్రుల నుంచి డిస్పోజల్స్‌ను సైతం పడేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతం నుంచి దుర్వాసనతో పాటు రసాయనాలు, విషవాయువులు వెలువడడంతో పొలాల్లో పనిచేయలేని పరిస్థితి నెలకొందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతి ఏటా వర్షాకాలంలో భారీ వర్షాలకు కలుషితమైన నీరంతా సమీపంలోని గుట్టకాడి కుంట, దమ్మాయిచెరువు, కాసాయికుంట, పిండే చెరువుల్లోకి చేరుతోంది. దీంతో చెరువుల్లోని నీళ్లు కాలుష్యం చెంది చేపలు మృత్యువాత పడుతున్నాయని మత్స్యకారులు లబోదిబోమంటున్నారు. కొంతకాలంగా మృత్యువాత పడుతున్న చేపల సంఖ్య పెరిగిపోవడంతో తాము ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి డంప్ యార్డును ఇతర ప్రాంతానికి తరలించాలని గ్రామస్తులతో పాటు మత్స్యకారులు కోరుతున్నారు.
చెరువుల్లోకి చేరుతున్న కలుషిత నీరు
పట్టించుకోని మున్సిపల్ అధికారులు
మృత్యువాత పడుతున్న చేపలు
ఉపాధి కోల్పోతున్నామనిమత్స్యకారుల ఆవేదన