
ఉదయం పనులు.. రాత్రి దొంగతనాలు
సిద్దిపేటకమాన్: ఉదయం ఫంక్షన్‌హాల్లో పనులు చేసుకుంటూ రాత్రి సమయాల్లో షెటర్ తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సిద్దిపేట టూటౌన్ సీఐ ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని బీజేఆర్ చౌరస్తాలోని వైష్ణవి మెడికల్ షాప్, వన్‌టౌన్ పీఎస్ పరిధిలోని హరిహర మెడికల్ షాప్‌లో ఈ నెల 11న రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి సీసీ పుటేజీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న రాజమండ్రికి చెందిన ఇందుకూరి సూర్య (38), సిద్దిపేట జిల్లా తొగుట మండలం గుడికందులకు చెందిన బాణపురం సుభాష్ (40), మెదక్ జిల్లా పటాన్‌చెర్‌కు చెందిన ఎస్‌కె సాజిద్ (32), హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన మహ్మద్ ఆరీఫ్ (21)లు ఫంక్షన్‌హాల్ పనులు చేస్తుండగా పరిచయమయ్యారు. వీరంతా ఓ ముఠాగా ఏర్పడి ఉదయం ఫంక్షన్‌హాళ్లలో పనులు చేస్తూ రాత్రి సమయాల్లో తాళం వేసిన దుకాణాల షెటర్లు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్నారు. సీసీ పుటేజీల ఆధారంగా వారిని అరెస్టు చేశారు. అనంతరం నిందితుల నుంచి ఫోన్, ఆటోను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్‌ఐ అసిఫ్, ఐడీ పార్టీ కానిస్టేబుల్ కనకరాజు, ప్రశాంత్‌రెడ్డి, సిబ్బంది సందీప్‌రెడ్డిని సీఐ అభినందించారు.
షెటర్ తాళాలు పగులగొడుతున్ననిందితుల అరెస్ట్
నలుగురు నిందితులను రిమాండ్‌కు తరలించిన పోలీసులు
వివరాలు వెల్లడించిన సీఐ ఉపేందర్