
తప్పుడు పట్టా..
రిజిస్ట్రేషన్ నిలిపివేయాలని
రైతు ఆత్మహత్యాయత్నం
చిన్నకోడూరు(సిద్దిపేట): తమ పట్టా భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని, రిజిస్ట్రేషన్ నిలిపివేయాలని ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన చిన్నకోడూరు తహసీల్దార్ కార్యాలయంలో గురువారం చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని గోనెపల్లికి చెందిన ముష్మిరి యాదయ్యకు సర్వే నంబర్ 310లో వంశపారంపర్యంగా ఉన్న 1.32 గుంటల భూమిలో కొంతకాలంగా సాగు చేసుకుంటున్నారు. అయితే గతేడాది ఎలాంటి విక్రయాలు జరపకుండానే ముష్మిరి రామవ్వ, ముష్మిరి వజ్రవ్వ, ముష్మిరి బాల్‌రాజుల పేరిట పట్టాలోకి మారింది. అయితే, ఈ భూమిని ఇతరులకు విక్రయిస్తున్న విషయం తెలుసుకున్న యాదయ్య కుమారుడు రాజు వెంటనే భూ రిజిస్ట్రేషన్ నిలిపి వేయాలని తహసీల్దార్ సలీమ్‌కు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత క్షణికావేశంలో తనకు న్యాయం చేయాలని డీజిల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించగా.. స్థానికులు వెంటనే అడ్డుకున్నారు. అనంతరం తహసీల్దార్ సలీమ్, ఎస్‌ఐ సైఫ్ అలీ బాధితుడు రాజుతో మాట్లాడి సర్ది చెప్పారు. ఈ విషయంపై కలెక్టర్‌కు నివేదించి బాధితుడికి న్యాయం చేస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు.