
ఇందిరమ్మ పంచాయితీ
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పంపిన ప్రతిపాదన జాబితాలకు బ్రేకు పడింది. ఈ ప్రతిపాదనలు పంపి నెలలు గడుస్తున్నా మోక్షం లభించడం లేదు. దీంతో ఈ జాబితాల్లోని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడం లేదు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లోనే ఈ పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న అందోల్, ఖేడ్ నియోజకవర్గాల్లో మాత్రం ఈ పరిస్థితి లేదు. అలాగే బీఆర్‌ఎస్ నుంచి గెలిచి..కాంగ్రెస్‌లో కొనసాగుతున్న పటాన్‌చెరు ఎమ్మెల్యే ప్రతిపాదనలకు సైతం ఆమోదముద్ర పడటం గమనార్హం. – సాక్షిప్రతినిధి, సంగారెడ్డి:
ఇన్‌చార్జి మంత్రి వద్దే పెండింగ్!
నిరుపేదలకు గృహ వసతిని కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మగృహాల పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇలా నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లను మంజూరు చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో 40% ఇళ్లను అంటే సుమారు 1,400 ఇళ్లను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల ద్వారా ప్రతిపాదనలు పంపారు. అయితే ఈ ప్రతిపాదనలకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వద్ద బ్రేకులు పడ్డాయి. జిల్లాలో మిగిలిన మూడు నియోజకవర్గాల నుంచి వెళ్లిన లబ్ధిదారుల జాబితాలకు ఆమోదముద్ర పడగా, ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు పంపిన 2,800 ఇండ్ల లబ్ధిదారుల జాబితాలకు మాత్రం ఆమోదం రాలేదు.
మంత్రితో చర్చించనున్న ఎమ్మెల్యేలు
తమ ప్రతిపాదనలకు నెలలు గడుస్తున్నా ఆమోదముద్ర పడకపోవడంతో జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్‌తో చర్చించాలని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఈనెల 14న ఈ భేటీ కావాల్సి ఉండగా, వివిధ కారణాలతో ఈ అంశంపై చర్చించడం కుదరలేదు. రెండురోజుల్లో మంత్రిని కలుస్తామని ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు.
అర్హులైన వారందరికీ ఇచ్చాం
ఎమ్మెల్యేలకు కేటాయించిన 40% ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల జాబితాలతో ప్రతిపాదనలు పంపాము. కానీ ఇళ్లు మాత్రం మంజూరు చేయలేదు. ఇది సరికాదు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పార్టీలకతీతంగా అర్హులైన పేదలందరికీ అన్ని సంక్షేమ పథకాలను వర్తింప చేశాము.
– చింత ప్రభాకర్, సంగారెడ్డి ఎమ్మెల్యే
గతంలో ఇలా లేకుండే
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక తీరు సరికాదు. మేం ఇచ్చిన ప్రతిపాదనలకు మంజూరు ఇవ్వడంలేదు. సంక్షేమ పథకాల అమలు విషయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఇలా లేకుండే. మా ప్రతిపాదనలకు ఆమోదం కోసం మంత్రితో చర్చిస్తాం.
– కె. మాణిక్‌రావు, జహీరాబాద్ ఎమ్మెల్యే
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పంపిన లబ్ధిదారుల జాబితాకు బ్రేక్
మంజూరును ఆపేసిన ఇన్‌చార్జి మంత్రి వివేక్
2,800 ఇండ్ల చొప్పున ప్రతిపాదనలు పంపిన ఇద్దరు ఎమ్మెల్యేలు