
పారిశుద్ధ్యం బాధ్యత అధికారులదే
వట్‌పల్లి(అందోల్): సీజనల్ వ్యాధులు వ్యాప్తిచెందకుండా ఉండేందుకు పంచాయితీ కార్యదర్శులు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా స్పష్టం చేశారు. మండల పరిధిలోని మర్వెల్లి గ్రామంలో బుధవారం ఆయన పర్యటించారు. గ్రామంలోని పల్లె ప్రకృతివనం, మురికికాలువలను పరిశీలించి, స్వచ్ఛతపై అధికారులకు పలు సూచనలు చేశారు. శిథిలావస్థకు చెందిన ఇళ్లలో నివాసం ఉండకుండా, సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మురికికాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని దోమల నివారణకు అన్ని గ్రామాల్లో తప్పనిసరిగా ఫాగింగ్ చేయాలని కార్యదర్శులను ఆదేశించారు. గ్రామాల్లో మంచినీటి ట్యాంకులను రెండు రోజులకొకసారి తప్పనిసరిగా శుభ్రం చేసిన తర్వాతనే నీటిని కుళాయిలకు వదలాలని చెప్పారు. గ్రామాల్లో చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు డంప్‌యార్డులకు తరలించాలన్నారు. విధుల పట్ల ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆయన వెంట ఎంపీవో ఖాజానసీరోద్దీన్, కార్మికులు, సిబ్బంది ఉన్నారు.
డీపీఓ సాయిబాబా