
హైదరాబాద్‌కు తాగునీరెట్లా?
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : సింగూరు ప్రాజెక్టును ఖాళీ చేస్తే హైదరాబాద్‌కు తాగునీటి సరఫరాకు ప్రత్యామ్నాయం ఎలా అనే అంశం తెరపైకి వస్తోంది. నగరానికి తాగునీటి సరఫరాలో ఈ జలాశయమే కీలకం. హెచ్‌ఎండబ్ల్యూఎస్ (హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్) ఇక్కడి నుంచి ప్రతిరోజు 120 మిలియన్ గ్యాలెన్ల తాగునీరు హైదరాబాద్‌కు సరఫరా చేస్తోంది. నగరంలోని గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, బంజారాహిల్స్, టోలీచౌక్ (పాక్షికంగా), హఫీజ్‌పేట్, హైదర్‌నగర్, లింగంపల్లి, రామచంద్రాపురం, పటాన్‌చెరుకు ప్రాంతాలకు ఇక్కడి నుంచే పంపింగ్ జరుగుతోంది. ఎన్‌డీఎస్‌ఏ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పుడు ఈ ప్రాజెక్టును ఖాళీ చేస్తే ఈ ప్రాంతాలకు తాగునీటి సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ప్రశ్నార్థకంగా మారాయని ఆ సంస్థ వర్గాలు పేర్కొంటున్నాయి.
డెడ్ స్టోరేజీ కోసం ప్రతిపాదనలు
ఈ జలాశయం కట్ట పూర్తిగా దెబ్బతిన్నదని డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) ఇటీవల హెచ్చరించిన సంగతి తెలిసిందే. తక్షణం కట్ట రివీట్‌మెంట్‌కు మరమ్మతులు చేయని పక్షంలో డ్యామ్ తెగిపోయి భారీ నష్టం వాటిల్లుతుందని నివేదిక ఇచ్చింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో నీటిపారుదల శాఖ ప్రాజెక్టులోని నీటిని ఖాళీ చేస్తోంది. ఇటీవల కురిసిన వర్షంతో వచ్చిన వరదతోపాటు, ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీటిని కూడా దిగువకు వదిలేస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 29.9 టీఎంసీలు. వారం రోజుల క్రితం 22.2 టీఎంసీలు నీరు ఉండేది. ఇప్పుడు ఈ నీటి నిల్వను 18.6 టీఎంసీలకు తగ్గించారు. 16.55 టీఎంసీలకు తగ్గించేందుకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి అనుమతి ఉంది. తాజాగా డెడ్ స్టోరేజీ (1.5 టీఎంసీల)కు తగ్గించేందుకు అనుమతి మంజూరు చేయాలని జిల్లా నీటి పారుదల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రాజెక్టును డెడ్‌స్టోరేజీ చేసి రూ.16.08 కోట్లతో మరమ్మతు పనులు చేస్తామని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉందని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
మిషన్ భగీరథకు సైతం..
సంగారెడ్డితోపాటు, మెదక్ జిల్లాలో కొన్ని గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తున్న భగీరథ తాగునీటి పథకాలకు సింగూరు ప్రాజెక్టే ఆధారం. ఈ తాగునీటి పథకాల కోసం రోజుకు 120 ఎంఎల్‌డీ (మిలియన్ లీటర్ల తాగునీరు సరఫరా అవుతోంది. ప్రధానంగా సంగారెడ్డి, పటాన్‌చెరు, జహీరాబాద్, అందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాలతోపాటు, మెదక్ జిలాల్లో కొన్ని గ్రామాలకు ఈ ప్రాజెక్టు నుంచి తాగునీటి సరఫరా జరుగుతోంది. ప్రాజెక్టును ఖాళీ చేస్తే పాత తాగునీటి పథకాలతోపాటు, బోర్లే ఆధారం కానున్నాయి.
సింగూరు ప్రాజెక్టు
టీఎంసీలు
ప్రశ్నార్థకంగా మారిన ప్రత్యామ్నాయం.!
సింగూరును ఖాళీ చేస్తున్ననీటి పారుదల శాఖ
డెడ్ స్టోరేజీకి సర్కారుకు ప్రతిపాదనలు
16.5 టీఎంసీలకు తగ్గించేందుకు అనుమతి
తక్షణమే ఖాళీ చేసి మరమ్మతులు చేయాలి : ఎన్‌డీఎస్‌ఏ
సింగూరు నుంచి నీటి కేటాయింపులు ఇలా..
కామారెడ్డి జిల్లానిజాంసాగర్ ప్రాజెక్టుకు
8.35
ఘనపురం
ఆనకట్టకు..
4.06
మిషన్ భగీరథతాగునీటి పథకానికి..
5.70
సింగూరు
కాలువలకు
2.00
హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సప్లయ్
6.96