
ఇల్లు ఖాళీ చేయించిన ఆర్‌ఐ
కుటుంబ సభ్యులతో కలిసి కనిపించకుండా పోయిన ముంపు బాధితుడు
గజ్వేల్‌రూరల్: ఇంటి మరమ్మతులకు పెట్టిన డబ్బులను చెల్లిస్తేనే ఖాళీ చేస్తామంటూ మల్లన్నసాగర్ ముంపు గ్రామానికి చెందిన ఓ భూ బాధితుడు తాను ఉంటున్న ఇంటిని ఖాళీ చేయించేందుకు వచ్చిన అధికారులతో ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ ఇంటిని వేరొకరికి కేటాయించగా కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో రెవెన్యూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వచ్చిన ఆర్‌ఐ ఇంటిని ఖాళీ చేయించగా సదరు కుటుంబ సభ్యులు రోడ్డెక్కి కనిపించకుండా పోవడంతో గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన బుధవారం గజ్వేల్‌లో చోటు చేసుకుంది. మల్లన్నసాగర్ ముంపు గ్రామమైన ఏటిగడ్డ కిష్టాపూర్‌కు చెందిన అరికెల చంద్రంకు పునరావాసం ప్యాకేజీ కింద ప్లాటును ఎంచుకోగా, ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో ఓ అసంపూర్తి నిర్మాణ ఇంటిలో ఉంచారు. తిరిగి కొద్ది రోజుల తర్వాత తనకు ఇల్లు కావాలంటూ ప్యాకేజీ కింద వచ్చిన రూ.5లక్షలను తిరిగి ప్రభుత్వానికే డీడీ కట్టినప్పటికీ, ఇళ్లు ఇవ్వలేమంటూ అధికారులు ఆ డీడీని తిరిగి చంద్రంకే చెల్లించారు. ఎలాగైనా అధికారులు తనకు ఇళ్లు కేటాయిస్తారనే ఆశతో చంద్రం తాత్కాలికంగా నివాసముంటున్న ఇంటికి రూ.13లక్షలు చెల్లించి మరమ్మతులు చేయించుకున్నాడు. ఈ క్రమంలో చంద్రం ఉంటున్న ఇంటిని అధికారులు మాధవరెడ్డి అనే వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో మాధవరెడ్డి ఇంటిని ఖాళీ చేయాలని చంద్రంను కోరగా.. తాను ఇంటి మరమ్మతులకు పెట్టిన డబ్బులను చెల్లిస్తే వెళ్ళిపోతామని చంద్రం పేర్కొనడంతో నిరాకరించిన మాధవరెడ్డి కోర్టును ఆశ్రయించి తనకు ఇంటిని అప్పగించాలని ఉత్తర్వులు తెచ్చుకున్నాడు. కోర్టు ఉత్తర్వుల మేరకు ఆర్డీవో, తహశీల్దార్ ఆదేశాల మేరకు గజ్వేల్ ఆర్‌ఐ కృష్ణ బుధవారం రెవెన్యూ సిబ్బంది, పోలీసుల సాయంతో చంద్రం ఇల్లు ఖాళీ చేయించేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఉన్నఫలంగా ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికి వెళ్లేదని, తమకు న్యాయం చేయాలంటూ చంద్రం కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రెవెన్యూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సిబ్బంది, పోలీసులు చంద్రం కుటుంబ సభ్యులను ఇల్లు ఖాళీ చేయించి మాధవరెడ్డికి తాళాలను అప్పగించారు. ఈ క్రమంలో చంద్రం తన భార్య లావణ్య పిల్లలతో కలిసి కనిపించకుండా పోయాడు. గ్రామ మాజీ సర్పంచ్ ప్రతాప్‌రెడ్డితో పాటు చంద్రం బంధువులు, గ్రామస్తులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని ఫిర్యాదు చేశారు.