
మా హయాంలో యూరియా కొరత లేదు
కొమురవెల్లి(సిద్దిపేట): కేసీఆర్ పాలనలో రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని, ముందుచూపుతో యూరియా కొరత లేకుండా చేశారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గుర్తు చేశారు. కొద్ది రోజుల క్రితం ఆయన కాలుకు గాయం కావ డంతో శస్త్ర చికిత్స చేయించుకుని నయం అయిన వెంటనే బుధవారం కొమురవెల్లి మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చారు. ఆయనకు కార్యకర్తలు కొమురవెల్లి పాత కమాన్ వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం ర్యాలీగా ఆలయం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చేర్యాల పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ హయాంలో రిజర్వాయర్లను ఎప్పటికప్పుడు నింపి రైతులకు నీరు అందించామని తెలిపారు. కాళేశ్వరం రిజర్వాయర్‌పై జష్టిస్ ఘోష్ ఇచ్చిన నివేదికను కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చి అబద్ధంగా ప్రచారం చేస్తూ కేసీఆర్, హరీశ్‌రావులపై ఆసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచంలోనే ఎత్తైన, తక్కువ సమయంలో పూర్తి చేసిన కాళేశ్వరం రిజర్వాయర్ రెండు పిల్లర్లు కుంగితే వాటిని బాగు చేసి రైతులకు నీరు అందిచాల్సింది పోయి, విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చేర్యాల కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే పల్లా