ముస్తాబవుతున్న గణనాథులు | - | Sakshi
Sakshi News home page

ముస్తాబవుతున్న గణనాథులు

Aug 20 2025 9:35 AM | Updated on Aug 20 2025 9:35 AM

ముస్త

ముస్తాబవుతున్న గణనాథులు

● ఆకర్షణీయంగా విగ్రహాలు ● రంజోల్‌లో పెద్ద ఎత్తున తయారీ

రంగులద్దుతున్న రాజస్తాన్‌ కళాకారులు

సైజు, రూపం ఆధారంగా ధరలు

జహీరాబాద్‌ టౌన్‌: వినాయకుడి పండగ వస్తుందంటే చాలు చిన్న, పెద్ద, పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా మండపాలు ఏర్పాటు చేసుకుని విగ్రహాలను ప్రతిష్టిస్తుంటారు. అప్పుడే వారం రోజుల ముందే సందడి మొదలైంది. వినాయక చవితి పర్వదినానికి గణపయ్య విగ్రహాలు సిద్ధం అవుతున్నాయి. విగ్రహాలను రాజస్తాన్‌కు చెందిన కళాకారులు ఆకర్షణీయంగా తయారు చేస్తున్నారు. అందంగా ఉండటానికి రంగులద్ది మెరుపులు అద్దుతున్నారు. మండపాల నిర్వాహకులు వచ్చి అడ్వా న్స్‌ బుకింగ్‌ చేసుకుంటున్నారు.

జహీరాబాద్‌ ప్రాంతంలోని రంజోల్‌ వద్ద దూల్‌పేటలో మాదిరిగా పెద్ద ఎత్తున విగ్రహాలను తయారు చేస్తున్నారు. పది మంది కళాకారుల కుటుంబాలు వేసవి నుంచి తయారీ ప్రక్రియను ప్రారంభించారు. ఇక్కడ తయారైన విగ్రహాలను జిల్లాతో పాటు హైదరాబాద్‌, పొరుగున ఉన్న కర్నాటక, మహారాష్ట్రకు తరలిస్తున్నారు. కొంత మంది మండపాల నిర్వాహకులు ముందుగా ఆర్డర్‌ ఇచ్చి తమకు నచ్చిన నమూనాలో విగ్రహాలను తయారీ చేయించుకుంటారు. వినాయక చవితి ఇంకా వారం రోజులు ఉండగా అప్పుడే విగ్రహాల కొనుగోళ్ల సందడి మొదలైంది.

సైజును బట్టి ధరలు

విగ్రహాల సైజు, రూపం బట్టి ధరలు నిర్ణయించి అమ్ముతున్నారు. రంజోల్‌ వద్ద 3 నుంచి 15 అడుగుల విగ్రహాలను తయారు చేస్తున్నారు. రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు ధరలు పలుకుతున్నాయి. సుమారు ఐదారు కార్ఖానాల్లో ఉండగా ఒక్కో దాంట్లో 150కి పైగా విగ్రహాలను తయారు చేసి విక్రయిస్తున్నారు. ఆర్డర్లపై కోరిన సైజులో విగ్రహాలను తయారు చేసి ఇస్తారు.

విగ్రహాలతోనే ఉపాధి

వినాయక విగ్రహాల తయారీతోనే ఉపాధి పొందుతున్నాం. కుటుంబ సభ్యులంతా ఇక్కడే ఉంటూ రాత్రింబవళ్లు కష్టపడుతాం. తయారీ ఖర్చులు పెరిగాయి. ఆశించిన మేర లాభాలు రావడం లేదు. ఈ సారి అమ్మకాలు పెరుగుతాయని ఆశిస్తున్నాం. పుణే, ముంబయి తరహా కొత్త మాడల్స్‌ డిమాండ్‌పై తయారు చేస్తున్నాం. ప్రతిమలు తీసుకునేందుకు జహీరాబాద్‌తో పాటు కర్నాటక రాష్ట్రంలోని బీదర్‌, ఉమ్నబాద్‌, బాల్కీ తదితర ప్రాంతాల ప్రజలు వస్తారు.

– ముఖేశ్‌, రాజస్తాన్‌ కళాకారుడు

పీవోపీతో విగ్రహాల తయారీ

రాజస్తాన్‌ కళాకారులు విగ్రహాల తయారీకి పెట్టింది పేరు. కుటుంబ సభ్యులంతా సుమారు 10 నెలల పాటు విగ్రహాలను పీవోపీతో తయారు చేస్తారు. కొందరూ విగ్రహాలను తయారు చేస్తుంటే మహిళలు, పిల్లలు రంగులు దిద్దుతారు. ఈ నెల 27న వినాయక చవితి పండగ ఉన్నందున కొనుగోళ్ల సందడి ప్రారంభమైంది.

ముస్తాబవుతున్న గణనాథులు1
1/1

ముస్తాబవుతున్న గణనాథులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement