
యూనిఫామ్ తిప్పలు
కురచ దుస్తులతో విద్యార్థుల అవస్థలు
పాతది వేసుకుంటున్న
మా పాఠశాలలో ఉపాధ్యాయులు యూనిఫామ్ ఇచ్చారు. అది వేసుకుంటే చాలా ఇబ్బందిగా ఉంది. పాత ది వేసుకుని బడికి పోతున్నాం. మా కొలతలకు తగ్గట్టుగా మంచిగా కుట్టి ఇవ్వాలి.
– విజయ్, 10వ తరగతి విద్యార్థి
చిన్నగా ఉంది
పాఠశాలలో ఇచ్చిన యూనిఫామ్ చిన్నదిగా ఉంది. అది వేసుకోవడానికి రావడం లేదు. ఉపాధ్యాయులేమో రోజు యూనిఫామ్ వేసుకుని రమ్మంటున్నారు. సరైన కొలతలతో కుట్టి తిరిగి మళ్లీ ఇవ్వాలి.
– ప్రణయ్, 7వ తరగతి, విద్యార్థి
చర్యలు తీసుకుంటాం
విద్యార్థులకు పంపిణీ చేసిన యునిఫారాలు కొలతల్లో హెచ్చుతగ్గులు వచ్చిన వాటిని గుర్తించి తిరిగి సరిచేసి ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గుర్తించి వివరాలు అందిస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే స్వయం సహాయక సంఘాల సభ్యులకు యూనిఫాంల తయారీ విషయంలో శిక్షణ ఇప్పించాం. అనుభజ్ఞులతోనే తయారీ చేయిస్తున్నాం.
– హన్మంత్‌రెడ్డి,జిల్లా మెప్మా అధికారి, మెదక్
తూప్రాన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సర్కారు పంపిణీ చేసిన యూనిఫామ్‌లు సరిగా లేక వాటిని ధరించలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు పాఠశాలలకు పోటీగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పిస్తున్నామంటూ ఊదరగొడుతూ ప్రచారం చేస్తున్నప్పటికీ ఆచరణలో విఫలమైంది. ముఖ్యంగా యూనిఫారాల సరఫరాలో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించడంతో కురుచ దుస్తులతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ప్రతి యేటా రెండు జతల చొప్పున ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుంది. జిల్లాలోని 922 ప్రభుత్వ పాఠశాలల్లో 84 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. రూరల్ ప్రాంతాల్లోని పాఠశాలలకు డీఆర్‌డీఏ, అర్బన్ ప్రాంతాల్లో తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేట, మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని పాఠశాలలకు మెప్మా పరిధిలో యూనిఫాంలు అందజేస్తున్నారు. విద్యార్థులకు పంపిణీ చేసిన యునిఫారాలు కొలతలకు అనుగుణంగా లేవని దీంతో ధరించలేక పోతున్నామని వాపోతున్నారు. పొట్టి దుస్తులతోనే పాఠశాలలకు హాజరవుతున్నారు. గతంలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా యునిఫారాల క్లాత్‌ను ఎంఆర్‌సీ కేంద్రాలకు పంపించేవారు. వాటిని విద్యార్థుల కొలతలను బట్టి పాఠశాల స్థాయిలో టైలర్స్‌తో కుట్టించి పిల్లలకు అందించేవారు. ఇందుకు ఒక్కో జత కుట్టినందుకు ప్రభుత్వం రూ.40 చెల్లించేది. కాని రెండేళ్లుగా సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా విద్యార్థులకు కావాల్సిన క్లాత్‌ను సరఫరా చేస్తుంది. గతంలో కాంట్రాక్ట్ పద్ధతిని రద్దు చేసి స్వయం సహాయక సంఘాల ద్వారా యునిఫాంలు కుట్టిస్తున్నారు. ఒక్కో జతకు రూ.75 చొప్పున చెల్లిస్తున్నారు. కానీ తరగతుల వారీగా యూనిఫాం కుట్టడం ద్వారా ఒక తరగతిలో ఒక విద్యార్థి పొడువుగా, మరొకరు చిన్నగా ఉండటంతో సరిపోవడం లేదు. ఇప్పటికై నా అధికారులు చర్యలు చేపట్టాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
జిల్లాలోని సర్కారు బడుల్లో84 వేల మంది పిల్లలు
పట్టించుకోని అధికారులు

యూనిఫామ్ తిప్పలు