
దొరకని ఆచూకీ
కొమురవెల్లి(సిద్దిపేట): ఆర్మీ జవాన్ ఆచూకీ లభించకపోవడంతో 11 రోజులుగా కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. మండలంలోని అయినాపూర్ గ్రామానికి చెందిన తోట అనిల్ పడకొండేళ్ల క్రితం ఆర్మీలో చేరాడు. ప్రస్తుతం పంజాబ్‌లోని అంబాలలో విధులు నిర్వహిస్తున్నాడు. జూలైలో ట్రైనింగ్ నిమిత్తం సికింద్రాబాద్‌కు వచ్చాడు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత సెలవుపై అయినాపూర్‌లోని ఇంటికి వచ్చాడు. ఈనెల 6న విధుల్లో చేరేందుకు పంజాబ్‌లోని అంబాలకు వెళ్లాడు. 8వ తేదీన ఉదయం ఆర్మీ క్యాంపులో రిపోర్టు ఇచ్చి ఇంటికి ఫోన్ చేసి విధుల్లో చేరినట్టు తెలిపాడు. అదే రోజు సాయత్రం మళ్లీ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి నేను చనిపోతున్నాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. దీంతో కుటుంబ సభ్యులు పంజాబ్‌లో ఆర్మీ అధికారులను సంప్రదించగా మొదట అతడు డ్యూటీలో ఉన్నాడని, తర్వాత అతడు అదృశ్యమైనట్లు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు సిద్దిపేట సీపీ అనురాధను కలిసి ఫిర్యాదు చేశారు. అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను కలువగా ఆచూకీ త్వరగా కనుగొనాలని పంజాబ్ పోలీసులను ఫోన్‌లో ఆదేశించారు. తన కొడుకు ఆచూకీ త్వరగా కనిపెట్టాలని అనిల్ తల్లి మంగమ్మ ప్రభుత్వాలను కోరుతున్నారు. కాగా అనిల్ మిస్సింగ్‌పై ఫిర్యాదు చేశారని, పంజాబ్‌లో అక్కడి అధికారులతో మాట్లాడితే మిస్సింగ్ కేసు నమోదైనట్లు చెప్పారని ఎస్‌ఐ రాజు తెలిపారు.
జవాన్ అదృశ్యమై..11రోజులు
ఆందోళనలో కుటుంబ సభ్యులు