
నిండుకుండల్లా చెరువులు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : వారంరోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షాలకు జిల్లాలో చెరువులు మత్తడి దూకుతున్నాయి. చెరువులన్నీ జలసిరిని సంతరించుకుని నిండుకుండలను తలపిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 1,769 చెరువులు ఉన్నాయి. నీటి పారుదల శాఖ నివేదికల ప్రకారం మంగళవారం మధ్యాహ్నం వరకు ఇందులో 468 చెరువులు నిండి మత్తడి దూకుతున్నాయి. అంటే మొత్తం చెరువుల్లో 26% చెరువులు అలుగు పారుతున్నట్లు స్పష్టమవుతోంది.
50% నుంచి 75% నిండినవి 998
సగానికి పైగా నిండిన చెరువులు..అంటే 50% నుంచి 75% వరకు నిండినవి 998 ఉన్నాయి. జిల్లాలో ఉన్న మొత్తం చెరువుల్లో సుమారు 56% చెరువుల్లో 75% నీళ్లు వచ్చాయి. ఒక్క సంగారెడ్డి డివిజన్‌లోనే 938 చెరువులు 75% వరకు నిండినట్లు గుర్తించారు. 75% నుంచి 100% నిండిన చెరువులు 269 ఉన్నాయి. వీటిలో సగం చెరువులు ఒకటీ రెండు రోజుల్లో అలుగు పారుతాయని ఆశాఖ అధికారులు చెబుతున్నారు. 25% నుంచి 50% వరకు నీళ్లు వచ్చిన చెరువులు 20 ఉండగా, ఇంకా 25% లోపు నీళ్లు చేరిన చెరువుల సంఖ్య 14 ఉన్నట్లు గుర్తించారు. ఇవి ఎక్కువగా జహీరాబాద్ డివిజన్‌లో ఉన్నాయి. ఇతర డివిజన్లతో పోలిస్తే జహీరాబాద్ డివిజన్‌లో కాస్త తక్కువ వర్షపాతం నమోదవుతుండటంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ చెరువులతోపాటు చెక్‌డ్యామ్‌లు, ఆనికట్‌ల వద్ద ఉధృతంగా వరద ప్రవహిస్తోంది. భూగర్భ జలాల అభివృద్ధి కోసం నిర్మించిన పర్క్యులేషన్ ట్యాంకుల్లో సైతం నీరు చేరినట్లు ఆశాఖ నివేదికలు చెబుతున్నాయి.
జిల్లాలో అత్యధికంగా దౌల్తాబాద్ నీటిపారుదలశాఖ డివిజన్‌లో 302 చెరువులు అలుగు పారుతున్నాయి. ఈ డివిజన్‌లో 394 చెరువులున్నాయి. మిగిలిన 92 చెరువులు కూడా 75% నుంచి 100% నిండినట్లు ఆశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతంలో అధిక వర్షాలు నమోదవుతుండటంతో ఇక్కడి చెరువులు నిండాయి. ఖేడ్ డివిజన్‌లో 71, సంగారెడ్డి డివిజన్‌లో 63, జహీరాబాద్ డివిజన్‌లో 32 చెరువులు పూర్తిగా నిండి అలుగు పారుతున్నాయి.
అత్యధికంగా దౌల్తాబాద్ డివిజన్‌లో
ఎడతెరిపిలేని వర్షాలతో
ఉట్టిపడుతున్న జలసిరి
జిల్లాలో మొత్తం చెరువులు 1,769
అలుగుపారుతున్నవి 468
మరిన్ని అలుగు పారుతాయి
జిల్లాలో 468 చెరువులు అలుగులు పారుతున్నాయి. ఒకటీ, రెండు రోజుల్లో ఈ అలుగు పారుతున్న చెరువుల సంఖ్య మరో వంద వరకు ఉంటాయి. వారం రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో పెద్ద ఎత్తున చెరువుల్లోకి వరద చేరుతోంది. భారీ వర్షాలతో చెరువులకు గండి పడే ప్రమాదాలు పొంచి ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించాం. – పోచమల్లు,
నీటిపారుదలశాఖ పర్యవేక్షక ఇంజనీర్