
గురుకులం ప్రిన్సిపాల్‌పై వేటు
నారాయణఖేడ్: చర్మవ్యాధులతో ఇబ్బందులు పడుతున్న ఖేడ్‌లోని బీసీ గురుకులాన్ని ఎమ్మెల్యే సంజీవరెడ్డి మంగళవారం తనిఖీ చేశారు. ‘సాక్షి’దినపత్రికల్లో ‘గురుకులానికి గజ్జి’శీర్షికన వచ్చిన కథనానికి ఎమ్మెల్యే స్పందించారు. పాఠశాలలోని గదులు తిరిగి విద్యార్థులతో సమస్యలపై ఆరా తీశారు. ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం వల్లనే వ్యాధులు ముదిరాయని, తమకు ఆయనతో భయం ఉందంటూ సమస్యలను ఎమ్మెల్యే ముందు విద్యార్థులు ఏకరవు పెట్టారు. కరెంటు స్విచ్‌లు చెడిపోయి గదులకు కరెంట్ సరఫరా వస్తోందని ఆందోళన చెందారు. గదుల్లో లైట్లు వెలగడం లేదని, ఫ్యాన్లు తిరగవని వాపోయారు. గురుకులాన్ని కలియదిరిగిన సంజీవరెడ్డి ఆర్సీవో గౌతంరెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు బిల్లులు, రికార్డులు పరిశీలించి బిల్లులపై ఆరా తీశారు.
ప్రిన్సిపాల్‌పై చర్యలకు ఆదేశం
విధుల్లో నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌ను విధుల్లోంచి తొలగించాలని ఆర్సీవో గౌతంరెడ్డికి ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రిన్సిపాల్‌గా జూనియర్ లెక్చరర్ ప్రతిభను నియమించారు. వర్గల్‌కు డిప్యుటేషన్‌పై వెళ్లిన స్వాతిని తిరిగి గురుకులానికి కేటాయించాలని ఆదేశించారు.
మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనంపెట్టాలని, నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని ఎమ్మె ల్యే హెచ్చరించారు.
సబ్‌కలెక్టర్ తనిఖీ
అనంతరం సబ్‌కలెక్టర్ ఉమాహారతి గురుకులా న్ని తనిఖీ చేసి గదులను పరిశీలించారు. నిజాంపేట్ వైద్యులు డా.తరుణి, డా.అరవింద్ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి గురుకులంలో 50మందికి చర్మవ్యాధులున్నట్లు గుర్తించారు. అనంతరం వారికి చికిత్సలు అందజేశారు.
ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా
నారాయణఖేడ్: ఖేడ్‌లోని బీసీ గురుకులంలో విద్యార్థులకు చర్మవ్యాధులు వచ్చినా పట్టించుకోకుండా వారి ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌ను తొలగించాలని ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం నాయకులు మంగళవారం గురుకులం ముందు ధర్నా చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రానికి ఎమ్మెల్యే సంజీవరెడ్డికి అందించారు.
జూనియర్ లెక్చరర్ ప్రతిభకు
బాధ్యతలు అప్పగింత
ఆర్సీవో తీరుపై ఎమ్మెల్యే అసహనం

గురుకులం ప్రిన్సిపాల్‌పై వేటు