
అరటి సాగు.. బాగు
జహీరాబాద్ టౌన్: అరటికి ఏ సీజన్‌లోనైనా మంచి డిమాండ్ ఉంటుంది. ఏడాది పొడువునా సాగుకు అనుకూలంగా వాణిజ్యపరంగా అత్యంత ప్రాధాన్యత సంతరిచుకోవడంతో రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. అరటి పంటతో పాటు పిలకలు, ఆకులకు గిరాకీ ఉంటుంది. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే మంచి దిగుబడులతో అధిక లాభాలు సాధించవచ్చు. జిల్లాలో జహీరాబాద్, నారాయణఖేడ్ తదితర ప్రాంతాల్లో రైతులు అధిక విస్తీర్ణంలో అరటి పంటను సాగు చేస్తున్నారు.
జిల్లాలో ఏడాది పొడవునా అరటికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఎర్రటి, నల్లరేగడి నేలలు సాగుకు అనుకూలం. జహీరాబాద్ డివిజన్‌లో వ్యవసాయ బావులు ఎక్కువగా ఉండటంతో నీటి తడులకు ఢోకాలేదు. జిల్లాలో జహీరాబాద్, కోహీర్, రాయికోడ్, ఝరాసంగం, న్యాల్‌కల్, గుమ్మడిదల, కొండాపూర్ తదితర మండలాల్లో అరటి ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతుంది. జహీరాబాద్ డివిజన్‌లో సాగు విస్తీర్ణం ఎప్పుడు తగ్గడం లేదు. ఒక్క జహీరాబాద్ డివిజన్‌లోనే ప్రతి సంవత్సరం సుమారు 500 పైగా ఎకరాల్లో పంట సాగవుతుంది. జిల్లా మొత్తం కలిపి సుమారు 2వేల ఎకరాల్లో అరటి పంటను రైతులు పండిస్తున్నారు. గతంలో మనూర్ మండలంలో పెద్ద ఎత్తున పండించే వారు. మంచి దిగుబడి వచ్చినా కొనడానికి వ్యాపారులు ముందుకు రాకపోవడంతో పంట సాగు పట్ల రైతులకు ఆసక్తి తగ్గింది. ఇప్పుడు అరటికి డిమాండ్ పెరగడంతో పాటు ప్రభుత్వం కూడా ప్రోత్సహించడం వల్ల సాగుకు అన్నదాతలు ఆసక్తి కనబరుస్తున్నారు.
ప్రభుత్వ రాయితీ
పండ్ల తోటల సాగును ప్రోత్సహించడంతో భాగంగా ప్రభుత్వం అరటి సాగు విస్తీర్ణం పెంచేందుకు రాయితీ అందిస్తుంది. అరటిని టిష్యూ కల్చర్, పిలకలు, గడ్డల పద్ధతిలో సాగు చేస్తారు. టిష్యూ కల్చర్, పిలకల పద్ధతికి ఉద్యానశాఖ ద్వారా సబ్సిడీ ఇస్తుంది. ఎకరాకు సుమారు రూ.35 వేల వరకు ఒక్కొక్క రైతుకు 5 ఎకరాల వరకు రాయితీ అందిస్తుంది. డ్రిప్ పరికరాలకు కూడా ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది.
ఆసక్తి చూపుతున్న అన్నదాతలు
ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం
పెరుగుతున్న విస్తీర్ణం
జిల్లాలో సుమారు 2వేల ఎకరాల్లో సాగు