
పెళ్లింట విషాదం
● తండీక్రొడుకు మృతి
● చంద్లాపూర్, గంగాపూర్ గ్రామాల్లో విషాదం
చిన్నకోడూరు(సిద్దిపేట): ఆ తండ్రీకొడుకుల అనుబంధంపై విధికి కన్నుకుట్టింది. వారిని శాశ్వతంగా విడదీసింది. పెళ్లి వేడుకల ఆనందం ముగియక ముందే ఆ కుటుంబంలో శోకం మిగిల్చింది. వారి మరణం రెండు గ్రామాల్లో విషాదం మిగిల్చింది. మండల పరిధిలోని చంద్లాపూర్ గ్రామానికి చెందిన మూర్తి గజేందర్ రెడ్డి(50)కి భార్య పద్మ, కుమారుడు రాజిరెడ్డి(27), కూతురు సంతోషి ఉన్నారు. వీరికి గంగాపూర్ శివారులో ఎకరం సాగు భూమి ఉంది. ఆ భూమిని సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నెల 14న కూతురు సంతోషి పెళ్లి ఘనంగా జరిపించారు. పెళ్లి పనులు పూర్తి కావడంతో సోమవారం తండ్రి, కొడుకు అడవి పందుల బెడద నుంచి మొక్కజొన్న పంటను రక్షించేందుకు వైరు చుడుతున్నారు. ఈ క్రమంలో విద్యుదాఘాతంతో తండ్రి, కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. పెళ్లింట విషాదం నెలకొనడంతో ఇటు చంద్లాపూర్, సాగు చేస్తున్న గంగాపూర్ గ్రామాల్లో విషాదం నెలకొంది. ఘటనా స్థలానికి చేరుకున్న రెండు గ్రామాల ప్రజలు, బంధువులు తండ్రి, కొడుకు మృతదేహాలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు.