
విగ్రహాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి
సదాశివపేట(సంగారెడ్డి): వినాయక చవితి వేడుకలకు మండపాల ఏర్పాటు, విగ్రహాల ప్రతిష్ఠాపనకు నిర్వాహకులు పోలీస్‌శాఖ నుంచి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్యగౌడ్ స్పష్టం చేశారు. పట్టణంలోని ఎన్‌గార్డెన్‌లో సీఐ వెంకటేశ్ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశానికి డీఎస్పీ హాజరై మాట్లాడారు. విగ్రహాల ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకు నిర్వాహకులు పూర్తిగా నిబంధనల మేరకు నడుచుకుంటూ నవరాత్రులను శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రదేశంలో మైక్‌సెట్లు ఏర్పాటు చేయాలంటే పోలీసు, విద్యుత్, మున్సిపల్, అగ్నిమాపక శాఖల అనుమతి తప్పసరిగా తీసుకోవాలన్నారు. వినాయక మండపాలు, నిమజ్జన ఊరేగింపులో డీజేలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. కార్యక్రమంలో గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు మునిపల్లి సత్యనారాయణ, సిద్దన్న, అశిరెడ్డి, ప్రవీణ్‌కుమార్ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.
సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్యగౌడ్