
గురుకులంలో తనిఖీలు
విద్యార్థుల అస్వస్థతపై
విచారణ చేపట్టిన అధికారులు
పుల్‌కల్(అందోల్): సింగూరు గురుకుల పాఠశాలలో విద్యార్థుల అస్వస్థతపై రాష్ట్ర గురుకుల సొసైటీ జాయింట్ సెక్రటరి సక్రునాయక్, జోనల్ అధికారి రజిని సందర్శించి విచారణ చేపట్టారు. విద్యార్థులు అస్వస్థతపై ‘సాక్షి’దినపత్రికలో వచ్చిన కథనంపై స్పందించి అధికారులు గురుకులాన్ని సందర్శించారు. విద్యార్థుల టాయిలెట్లు, వంటగదులను పరిశీలించి అపశుభ్రంగా ఉండటాన్ని గుర్తించారు. విద్యార్థుల ఆరోగ్యపరిస్థితిపై వివరాలు సేకరించారు. కాగా అధికారుల విచారణలో హౌస్ మాస్టర్‌లు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలడంతో చర్యలకు ఉపక్రమించారు. పేద విద్యార్థుల చదువుకునే సంస్థలో సిబ్బంది ఇంత నిర్లక్ష్యమా అని ప్రిన్సిపాల్ అడివయ్యపై మండిపడ్డారు. విద్యార్థులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బందిని నిలదీశారు. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు.