
గురుకులానికి గజ్జి
నారాయణఖేడ్: ఖేడ్‌లోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకులంలో చాలామంది విద్యార్థులు చర్మవ్యాధుల బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. రెండు నెలల నుంచి హాస్టల్‌లో విద్యార్థులు గజ్జి, తామర వంటి చర్మవ్యాధులతో ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నా ప్రిన్సిపాల్ పట్టించుకున్న పాపాన పోలేదు. విద్యార్థుల ఒంటిపై విపరీతమైన దద్దుర్లు వచ్చి దురదలు పెడుతున్నా ఎవరికి చెప్పుకోవాలో తెలియక నరకయాతన అనుభవిస్తున్నారు. దీంతో చాలామంది విద్యార్థులు హాస్టల్‌లో ఉండలేక ఇంటికి వెళ్లిపోయారు.
ఆస్పత్రులకు తిప్పుతున్న తల్లిదండ్రులు
గురుకులంలో సుమారు 50మంది విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారు. తమ పిల్లలకు చర్మవ్యాధులు నయం కాకపోవడంతో బీదర్, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లోని ఆస్పత్రుల చుట్టూ తిప్పుతున్నారు. చర్మవ్యాధి నిపుణులు పరీక్షించి రూ.వేల మందులు సూచిస్తున్నారు. విద్యార్థులకు కాస్త నయం కాగానే గురుకులానికి పంపించగానే తిరిగి చర్మవ్యాధులు అంటుకుంటున్నాయి. ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలో తెలియక అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు సతమతమవుతున్నారు. తమ పిల్లలను చూసేందుకు వెళ్లిన తల్లిదండ్రులు, బంధువులను ప్రిన్సిపాల్ కలవనివ్వకపోవడం, విద్యార్థులను గద్దించి పంపించి వేస్తుండటంతోనే చర్మవ్యాధులు మరింత తీవ్రమైనట్లు తెలుస్తోంది. పిల్లలను కలిసేందుకు వెళ్లినపుడు విషయం బయటపడుతుందని కలవనివ్వడంలేదని వారు చెబుతున్నారు.
చెత్తా చెదారంతో దుర్గంధం
గురుకులంలో పారిశుద్ధ్యం పూర్తిగా లోపించింది. నీటి ట్యాంకులను సరిగ్గా క్లీన్ చేయించడం లేదని, నీటిలో బ్లీచింగ్ చల్లకపోవడంతో చర్మవ్యాధులు మరింత తీవ్రమైనట్లు విద్యార్థులు వాపోతున్నారు. గురుకులంలో ఎక్కడపడితే అక్కడ చెత్తా చెదారం నిండి దుర్గంధం వెదజల్లుతోంది.
240 మందికి ఒకే మరుగుదొడ్డి
గురుకులంలో రెండు భవనాలున్నాయి. ఒక భవనంలో 5, 6, 7వ తరగతి విద్యార్థులు చదువుతూ నివాసం ఉంటున్నారు. మూడు తరగతులకు కలిపి 240మంది విద్యార్థులకుగాను 5 మరుగుదొడ్లు ఉండగా నాలుగు చెడిపోయాయి. వాటికి మరమ్మతు చేయించకపోవడంతో ఉన్న ఒక్క మరుగుదొడ్డినే ఈ 240 మంది విద్యార్థులు ఉపయోగించాల్సి పరిస్థితి నెలకొంది. మరో భవనంలో 8, 9, 10వ తరగతులకు కలిపి 240 మందికిగాను 3 మరుగుదొడ్లు ఉండగా ఒకటి ఉపాధ్యాయులు వాడుకొంటుండగా రెండింటినే 240మంది విద్యార్థులు ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికై నా అధికారులు చర్యలకు ఉపక్రమించాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. లేదంటే విద్యార్థి సంఘాలతో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
చర్మ వ్యాధులతో విద్యార్థుల అవస్థలు
ఇళ్లకు వెళ్లిపోయిన 50మంది పిల్లలు
ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంతో నరకయాతన

గురుకులానికి గజ్జి

గురుకులానికి గజ్జి