
అతలాకుతలం
ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న భారీ వర్షాలు జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. ఆదివారం అర్ధరాత్రి తర్వాత కురిసిన వర్షానికి వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చేలల్లోకి వరద చేరి పంట నష్టం వాటిల్లింది. పలుచోట్ల చెరువులకు గండ్లు పడ్డాయి. వరద ఉధృతికి పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పట్టణాల్లో రోడ్లపైకి నీరు చేరింది.
– సాక్షిప్రతినిధి, సంగారెడ్డి:
కంగ్టి మండలంలో కురిసిన భారీ వర్షానికి పలు వాగు పొంగి ప్రవహించాయి. ఏకంగా 16.6 సెం.మీల రికార్డుస్థాయి వర్షపాతం నమోదైంది. దీంతో ఈ మండలంలోని రాసోల్, మురుకుంజాల్, తడ్కల్ బాన్సువాడ రోడ్డు రాకపోకలు నిలిచిపోయాయి. వలుమూరు వాగు వంతెన వద్ద ఉన్న రోడ్డు 30 మీటర్ల మేరకు కోతకు గురైంది. విద్యుత్‌స్థంభాలు విరిగి పడటంతో పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కల్హేర్ మండలంలోని మహారాజువాగు, మీర్కంపేట్‌వాగు, సిర్గాపూర్ మండలంలోని గైరాన్‌తాండా వాగులు పొంగి ప్రవహించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతికి హత్నూర మండలం ఎల్లమ్మగూడ – కొడుపాక గ్రామాల రోడ్డు ధ్వంసమైంది. గుమ్మడిదల మండలంలోని అన్నారం వద్ద 765 జాతీయ రహదారిపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. ఈ నీటిని తొలగించేందుకు డివైడర్‌ను పగులగొట్టాల్సి వచ్చింది. అమీన్‌పూర్ మండలం గండిగూడెం వద్ద అవుటర్ రింగ్ రోడ్డుపై వరద నీరు ప్రవహించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో ఖాజీపల్లి, శంబీపూర్ వైపు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మునిపల్లి మండలం డబ్బవాగు రోడ్డుపై ప్రవహించడంతో ఝరాసంఘం మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
సింగూరుకు 37 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు సింగూరు ప్రాజెక్టు వరద పోటెత్తింది. సోమవారం సాయంత్రం 6 గంటలకు ఏకంగా 37 వేల క్యూసెక్కుల వరద చేరింది. ప్రాజెక్టుకు గండిపడే ప్రమాదం ఉండటంతో 43 వేల క్యూసెక్కులను గేట్ల ద్వారా, జెన్‌కో విద్యుత్ ఉత్పత్తికి నీటిని విడుదల చేస్తున్నారు. మధ్యతరహా ప్రాజెక్టు నల్లవాగు పూర్తి స్థాయిలో నిండింది.
పంట పొలాల్లోకి వరద
భారీ వర్షానికి పంట పొలాల్లోని వర్షం నీరు చేరింది. మునిపల్లి, ఝారసంగం, కోహీర్, రాయికోడ్, సదాశివపేట, కల్హేర్, నారాయణఖేడ్, నిజాంపేట తదితర మండలాల్లో పంటలు నీట మునిగాయి. పత్తి, కంది, పెసర, మినుము, మిరప వంట పంట పొలాల్లోకి వర్షం నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి.
రికార్డు స్థాయిలో వర్షపాతం
జిల్లాలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. నిజాంపేటలో 13.0 సెం.మీలు, కల్హేర్‌లో 11.9 సెం.మీలు, కడ్పాల్‌లో 10.7 సెం.మీలు, హత్నూరలో 10.1 సెం.మీలు, అన్నాసాగర్‌లో 10.3 సెం.మీలు, గుమ్మడిదలలో 9.4 సెంబీలు, సిర్గాపూర్‌లో 9.7 సెం.మీల రికార్డు వర్షపాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా అన్ని చోట్ల వర్షపాతం నమోదైంది. సోమవారం రోజంతా ముసురు పెట్టింది.
తెగిపడిన రోడ్లు..నిలిచిన రాకపోకలు
నీట మునిగిన పంటపొలాలు
పూర్తిగా నిండిన నల్లవాగు ప్రాజెక్టు
సింగూరుకు 37 వేల క్యూసెక్కుల
వరద రాక

అతలాకుతలం

అతలాకుతలం

అతలాకుతలం