
వ్యాధులు ప్రబలకుండా చర్యలు: అదనపు కలెక్టర్
సంగారెడ్డి జోన్: జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రతీ శుక్రవారం అన్ని గ్రామాలలో పరిసరాలను శుభ్రం చేయాలన్నారు. ఇళ్ల మధ్య మురుగునీరు నిల్వకుండా తగిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. తాగునీరు కలుషితం కాకుండా, ప్రతీ నాలుగు రోజులకొకసారి బ్లీచింగ్ కలపాలని సూచించారు. దోమల నివారణకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పారు. వైద్య ఆరోగ్యశాఖతోపాటు పంచాయతీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆరోగ్య కేంద్రాలలో మందుల కొరత లేకుండా చూసుకోవాలని సూచించారు.
పంట నష్టం వివరాలు సేకరణ
న్యాల్‌కల్ (జహీరాబాద్): మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో వర్షాలకు 69 ఎకరాల్లో పెసర, మినుము, సోయా పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయాధికారులు వెల్లడించారు. రేజింతల్, మామిడ్గి, ముంగి, హద్నూర్, హుమ్నాపూర్, మెరియంపూర్ తదితర గ్రామాల్లో ఎంఏఓ అభినాష్ వర్మ, ఏఈఓలు సోమవారం పర్యటించి పంట నష్టం వివరాలు సేకరించారు.
విద్యా వ్యవస్థను
కేంద్రం నిర్వీర్యం చేస్తోంది
ధర్నాలో అంగన్‌వాడీ ఉద్యోగులు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఐసీడీఎస్‌తోపాటు విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చిందని అంగన్‌వాడీ ఉద్యోగులు ఆరోపించారు. ప్రీ ప్రైమరీ విద్యను అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో అంగన్‌వాడీ ఉద్యోగులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్‌వాడీ ఉద్యోగులకు అతి తక్కువ వేతనం చెల్లిస్తూ పని భారం పెంచుతుందని విమర్శించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్నాలో కార్యదర్శి మంగ, నాయకులు ఏసుమణి, నాగేశ్వరి, గౌరమ్మ, ఇందిరా తదితరులు పాల్గొన్నారు.
అదృశ్య ఆయుధం
జియోస్పేషియల్ టెక్నాలజీ
ఇస్రో మాజీ శాస్త్రవేత్త పద్మజ
పటాన్‌చెరు: ఆధునిక యుద్ధంలో జియోస్పేషియల్ టెక్నాలజీని ‘అదృశ్య ఆయుధం’గా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మాజీ సీనియర్ శాస్త్రవేత్త, ట్రిబుల్ ఐటీ పీహెచ్‌డీ స్కాలర్ పద్మజ అభివర్ణించారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘జియో–స్పేషియల్ ఆపరేషనన్స్, రిమోట్ సెన్సింగ్ అనువర్తనాలు’అనే అంశంపై సోమవారం ఆమె అతిథి ఉపన్యాసం చేశారు. అంతరిక్ష వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ...జియోస్పేషియల్ సాంకేతికత శత్రు స్థావరాలు, అక్కడి భూభాగ పరిస్థితులు, నిర్దిష్ట లక్ష్యాలను ఛేదించే ప్రణాళికలను రచించడానికి తోడ్పడుతుందని చెప్పా రు. జియో భూమిని సూచిస్తుందని, స్పేషియ ల్ అనేది భూమిపై ఉన్న వస్తువుల రేఖాగణిత లక్షణాలను సూచిస్తుందని వివరించారు. కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.

వ్యాధులు ప్రబలకుండా చర్యలు: అదనపు కలెక్టర్

వ్యాధులు ప్రబలకుండా చర్యలు: అదనపు కలెక్టర్

వ్యాధులు ప్రబలకుండా చర్యలు: అదనపు కలెక్టర్