
సరిహద్దులు దాటొద్దు
సంగారెడ్డి జోన్: పంట సాగులో వినియోగించే యూరియాను జిల్లా సరిహద్దులు దాటకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.ప్రావీణ్య సూచించారు. సోమవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిర్వహించిన వీడియో కాన్ఫరెనన్స్ ముగిసిన అనంతరం జిల్లా ఎస్పీ పరితోశ్‌పంకజ్‌తో కలిసి కలెక్టర్ అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...జిల్లాలోని అన్ని సహకార సంఘాలలో అవసరం మేరకు ఎరువుల నిల్వలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. సొసైటీలలో ఎరువుల స్టాక్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. ఎక్కడైనా ఎరువుల విక్రయాల్లో అవకతవకలకు పాల్పడడం, బ్లాక్ మార్కెట్‌కు తరలించడం, నిర్ణీత ధర కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రస్తుత ఖరీఫ్‌తో పాటు వచ్చే రబీ సీజన్‌లో కూడా ఎరువుల కొరత తలెత్తకుండా రైతుల అవసరాలకు సరిపడా నిల్వలను అందుబాటులో ఉంచాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ తుల్జానాయక్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణిలో అర్జీల స్వీకరణ
కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని, వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలంటూ అధికారులతో బాధితులు మొరపెట్టుకున్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రావీణ్యతోపాటు ఇతర అధికారులు హాజరై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
నేనేమైనా దొంగనా?
మొగుడంపల్లి మండలంలోని ధనసిరి గ్రామానికి చెందిన రామ్‌రెడ్డి అనే రైతు నేనేమైనా దొంగనా? నా సమస్య చెప్పుకోవద్దా? అంటూ ప్రజావాణిలో అధికారుల ముందు విలపించాడు. గ్రామంలోని 307/అ సర్వే నంబర్ లో ఉన్న ఒక ఎకరా 31 గుంటలు అనువంశికంగా వస్తోంది. కొన్నేళ్ల క్రితం ధరణి రావటంతో అసైన్‌మెంట్ భూమిగా చూపిస్తోంది. మూడేళ్లుగా కార్యాలయాలు చుట్టూ తిరిగినా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
యూరియాపై సమీక్షలో కలెక్టర్ ప్రావీణ్య