
అద్దె భారం
సదాశివపేట పట్టణంలో అత్యధిక అద్దెలు ఉండే గురునగర్ కాలనీ
సదాశివపేట(సంగారెడ్డి): సదాశివపేట ప్రాంతంలో పరిశ్రమలు స్థాపిస్తుండటంతో పనిచేసేందుకు ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, పశ్చిమబెంగాల్, హరియాణ, కర్ణాటక, బిహార్, చత్తీశ్‌గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి వేలాదిమంది కార్మికులుగా జీవనోపాధి కోసం వచ్చి అద్దె ఇళ్లల్లో నివాసం ఉంటున్నారు. దీంతో అద్దె ఇళ్లకు డిమాండ్ భారీగా ఏర్పడింది. పెరుగుతున్న నిత్యావసరాలు, కూరగాయలతో సతమతమవుతున్న సామాన్యుడికి పెరిగిన ఇంటి అద్దె కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. యజమానులు ఇష్టానుసారం అద్దెలు పెంచడంతో వాటిని చెల్లించలేక సామాన్యులు సతమతమవుతున్నారు. పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు రూ.18 వేలు అందులో ఈస్‌ఐ, పీఎఫ్ కటింగ్‌లతోటు డుమ్మాలు కొట్టగా వచ్చేది రూ.13వేల వరకు నెలసరి వేతనం వస్తుంది. వీటితోనే ఇంటి అద్దె, కుటుంబ పోషణ, పిల్లల చదువులకు సరిపోవడం లేదని కార్మికులు వాపోతున్నారు.
ఆస్తిపన్ను పెరగడం వల్లే
సదాశివపేట జనాభా 60వేల వరకు ఉంటే అందులో 20వేల వరకు ప్రజలు అద్దె ఇళ్లల్లోనే జీవిస్తున్నారు. పట్టణంలోని శాసీ్త్రరోడ్, తిలక్‌రోడ్డు, సుభాష్‌రోడ్డు, గొల్లకేరీ, రహమత్‌నగర్, ఫయాజ్‌నగర్, రాఘవేంద్రనగర్, తదితర కాలనీల్లో అద్దె ఇళ్ల ధరలు ఆకాశనంటుతున్నాయి. ఈ ప్రాంతంలో డబుల్ బెడ్రూం ఇళ్ల అద్దె రూ.7 వేలపైమాటే, అంతేకాకుండా మేడమీద చిన్న గది అద్దెకు కావాలన్నా రూ.4 వేలపైమాటే. ఇంటి నల్లా పన్ను, భవన నిర్మాణ వ్యయం, ఆస్తిపన్ను భారీగా పెరిగినందువల్లేనని తెలుస్తోంది. దీంతో పేద ప్రజలు పట్టణానికి సుమారు 2 లేదా 3 కిలోమిటర్ల దూరంలో ఉన్న సిద్దాపూర్ కాలనీ, హనుమాన్‌నగర్ కాలనీతోపాటు పరిశ్రమలున్న గొల్లగూడెం, నందికంది, కంబాలపల్లి, మద్దికుంట గ్రామాల్లో తక్కువ రూ.2000 నుంచి రూ.3000ల లోపు అద్దె ఇళ్లను తీసుకుంటున్నారు.
వాణిజ్య సముదాయాల అద్దె కూడా..
పట్టణంలోని ప్రధాన రహదారి గాంధీచౌక్, బుక్కకేరి, పట్టలకేరి, సుభాష్‌రోడ్డు, శాసీ్త్రరోడ్డు, తిలక్‌రోడ్డు, వికారాబాద్‌రోడ్డు, అయ్యప్ప మందిరం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ఉన్న వాణిజ్య దుకాణాల సముదాయాల అద్దెలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. రెండు మూడేళ్ల క్రితం గరిష్టంగా దుకాణాల అద్దె రూ.10వేలు చెల్లించేవారు. ప్రస్తుతం రూ.20 వేల నుంచి రూ.30 వేలకు పెంచారని వ్యాపారులు వాపోతున్నారు. అద్దెలు పెంచడమే కాకుండా అడ్వాన్సుగా రూ.5లక్షల నుంచి రూ.20 లక్షల వరకు అద్దె స్థలాన్ని బట్టి పెంచుతున్నారు. దీంతో తక్కువ అడ్వాన్సులు, అద్దెలు ఉన్న ప్రాంతాల్లో దుకాణాలను పెట్టుకునేందుకు వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం స్పందించి అద్దెలపై నియంత్రణ విధించాలని వ్యాపారులు, ప్రజలు కోరుతున్నారు.
చుక్కల్లో ఇళ్ల కిరాయిలు.. చిక్కుల్లో ప్రజలు
సామాన్య మధ్యతరగతికి తప్పని తిప్పలు
పరిశ్రమల ఏర్పాటుతో మారిన పరిస్థితులు