కొత్తవారికీ రేషన్‌ | - | Sakshi
Sakshi News home page

కొత్తవారికీ రేషన్‌

Aug 18 2025 8:16 AM | Updated on Aug 18 2025 8:16 AM

కొత్త

కొత్తవారికీ రేషన్‌

● ఈసారి సన్న బియ్యంతోపాటు చేతిసంచి ఉచితం ● 31,460 కొత్తకార్డులు

వచ్చే నెల 1నుంచి పంపిణీ

నారాయణఖేడ్‌: కొత్త రేషన్‌కార్డుదారులతోపాటు, పాత కార్డుదారులకు కూడా సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి ప్రజా పంపిణీ కేంద్రాల ద్వారా సన్నబియ్యం పంపిణీకి పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. వర్షాకాలంలో పేదలు వరదలు, వర్షాల వల్ల రేషన్‌ తీసుకోవడం ఇబ్బందికరంగా ఉంటుందని భావించిన కేంద్రం జూన్‌ నెలలో ఒకేసారి మూడు నెలల బియ్యం కోటాను పంపిణీ చేయాలని నిర్ణయించి జూన్‌, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన సరుకులను అందజేసింది. సెప్టెంబర్‌ నుంచి తిరిగి నెలవారీ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సెప్టెంబర్‌ నెల కోటా సన్న బియ్యం రాష్ట్రస్థాయి గోడౌన్స్‌ (స్టేజ్‌–1) నుంచి మండల లెవల్‌ స్టాక్‌ (ఎంఎల్‌ఎస్‌) పాయింట్లకు పంపించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. సోమవారం నుంచి ఈ ప్రక్రియను ముమ్మరం చేయనున్నారు. కొత్తగా రేషన్‌ కార్డులు పొందిన వారందరికీ సెప్టెంబర్‌లో సన్నబియ్యం పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికార యంత్రాంగానికి ఇప్పటికే ఆదేశాలను జారీ చేశారు. ఈ లెక్కన జిల్లాలో మొత్తం 846 చౌక ధరల దుకాణాల ద్వారా 13,08,489 కార్డుదారులకు ఆహార భద్రతా పథకం కింద ఉచితంగా 8,345 మెట్రిక్‌ టన్నుల బియ్యం అందజేయనున్నారు. కాగా, ఇందులో కొత్తగా జిల్లాలో 31,460 కొత్త రేషన్‌ కార్డులు మంజూరు కాగా ప్రస్తుతం ఉన్న పాతకార్డుల్లో 97,130మంది పేర్లను కొత్తగా నమోదు చేశారు. వీరందరికీ సెప్టెంబర్‌ నెలలో రేషన్‌ అందజేయనున్నారు.

బియ్యంతో పాటు చేతిసంచి

తెల్ల రేషన్‌ కార్డుదారులకు ఉచితంగా రేషన్‌తోపాటు ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన పర్యావరణహితమైన చేతి సంచిని ప్రభుత్వం అందజేయనుంది. తెల్లటి రంగులో ఉన్న ఈ బ్యాగుపైన సీఎం, డిప్యూటీ సీఎం, పౌరసరఫరాల శాఖ మంత్రి ఫొటోలు ముద్రించి మధ్యలో ఇందిరమ్మ అభయహస్తం పేరుతో ఆరు గ్యారంటీలకు సంబంధించిన వివరాలతోపాటును చేతిసంచిపై ముద్రించారు. బస్తాపై ‘అందరికీ సన్న బియ్యం ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యం’అనే నినాదం ముద్రించారు. రూ.50విలువ చేసే ఈ బ్యాగును ఉచితంగానే సన్నబియ్యంతోపాటు అందజేస్తారు. ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించడం కోసం పర్యావరణహితంగా తయారు చేసిన ఈ బ్యాగును అందజేయనున్నారు. కాగా, బియ్యంతోపాటు అప్పట్లో ఇచ్చిన తరహాలో కందిపప్పు, చింతపండు, ఉప్పు, నూనె, పసుపు, గోధుమలు, చక్కెర తదితర సరుకునులను సైతం అందించాలని ప్రజలు కోరుతున్నారు.

కొత్తవారికీ రేషన్‌1
1/1

కొత్తవారికీ రేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement