
మీనం.. సిద్ధం!
● చేప పిల్లల పంపిణీకి సన్నద్ధం ● నేటి నుంచి 30 వరకు టెండర్ల ప్రక్రియ ● 36,029 హెక్ట్టార్ల విస్తీర్ణంలో చెరువులు
సంగారెడ్డి జోన్: జిల్లాలోని జల వనరులలో చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. ఈ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి కొరకు ప్రభుత్వం కొన్నేళ్లుగా ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. వానాకాలం సీజన్ ప్రారంభంలో అంతగా వర్షాలు కురవక పోయినప్పటికీ.. ప్రస్తుతం భారీగా వర్షాలు కురిసి నీటి వనరులు నిండుకుండలా మారాయి. జిల్లా వ్యాప్తంగా 36,029 హెక్టార్ల విస్తీర్ణంలో 1,135నీటి వనరులు ఉన్నాయి. రిజర్వాయర్లు మూడు, 79 పెద్ద చెరువులు, 1053 చిన్న చెరువులు ఉన్నాయి. 234 సంఘాలు ఉండగా.. 12,889 సభ్యులు ఉన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసే చేప పిల్లలు గుర్తింపు పొందిన సంఘాల సభ్యులు వాటిని పెంచుతుంటారు. అనంతరం వాటిని పట్టుకొని విక్రయించి జీవనం సాగిస్తుంటారు. గత సంవత్సరం జిల్లాలో 68 లక్షల 31వేల 132 చేప పిల్లలను వదిలినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఈసారి నాలుగు రకాల చేప పిల్లలను పంపిణీ చేయనున్నారు. బొచ్చ, రవుట, బంగారు తీగ, మోసు రకం వంటి చేప పిల్లలను వదులుతున్నారు. 8200 మీ.మీల సైజు గల చేప పిల్లలను పంపిణీ చేస్తారు. వీటి వివరాలు తెలుపుతూ సూచిక బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈసారి చేప పిల్లలతో పాటు రొయ్యలను పంపిణీ చేయబోతున్నామని ఇటీవల మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రకటించారు. దీంతో మత్స్యకారుల జీవనోపాధి మరింత మెరుగుపడే అవకాశం ఉంటుంది.