
సమీకృత మార్కెట్లు పూర్తయ్యేనా?
నిబంధనలకు నీళ్లు..
● రోడ్లపైనే విక్రయాలు.. వాహనదారులకు ఇక్కట్లు
● మంజూరైనవి 8.. పూర్తయింది ఒక్కటి
● ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు
● కరువైన అధికారుల పర్యవేక్షణ
సంగారెడ్డిలో నిలిచిన మార్కెట్ నిర్మాణం
సంగారెడ్డి: ఆర్భాటంగా వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణాలు చేపట్టి మధ్యలోనే వదిలేశారు. దీంతో రోడ్లపై విక్రయాలు జరగడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. దీంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికై నా అధికారులు మార్కెట్‌లను పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.
ఒకే చోట మాంసం, చేపలు, కూరగాయల అమ్మకాలు విక్రయించేందుకు సమీకృత మార్కెట్ల నిర్మాణానికి గత ప్రభుత్వం పూనుకుంది. ప్రజలు అన్నీ ఒకేచోట కొనుగోలు చేసుకొనే వీలుంటుందని సర్కారు కూడా భావించింది. త్వరగా నిర్మాణాలు పూర్తిచేయాలని అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పలు మున్సిపాలిటీల్లో ఆర్భాటంగా శంకుస్థాపన చేశారు. కానీ, ఇప్పటికీ వాటి నిర్మాణం పూర్తికాలేదు. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వం నిధులు మంజూరుచేసి టెండర్లు పిలిచింది. జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీల పరిధిలో పనులు ప్రారంభించారు. జహీరాబాద్ మినహా ఎక్కడా పనులు పూర్తికాలేదు. గుత్తేదారుల అలసత్వం, అధికారులు నిర్లక్ష్యం, బిల్లుల చెల్లింపులో జాప్యంతో నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి.
ఎనిమిదికి పూర్తయింది ఒక్కటే..
జిల్లాలో ఎనిమిది వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్లు మంజూరైతే.. జహీరాబాద్‌లో రూ.10కోట్లతో చేపట్టిన మార్కెట్ పూర్తయింది. సదాశివపేటలో రూ.5.5 కోట్లతో నిర్మాణాలు చేపడితే స్లాబుల వరకే పరిమితమైంది. అందోల్–జోగిపేటలో రూ.2కోట్లతో పనులు మొదలు పెట్టినా పునాది స్థాయిలో ఉంది. అలాగే అమీన్‌పూర్‌లో రూ.6.4కోట్లతో పనులు చేపడితే అదే పరిస్థితి. సంగారెడ్డిలో రూ.6.7కోట్లతో చేపట్టగా అవి కూడా స్లాబుల వరకే పరిమితమయ్యాయి. తెల్లాపూర్‌లో రూ.3.9, బొల్లారంలో రూ.6.5 కోట్లతో పనులు ప్రారంభించినా ఇంకా పిల్లర్ల దశలోనే ఉన్నాయి. నారాయణఖేడ్‌లో రూ.2.50కోట్లు మంజూరైనా ఇంకా పనులే ప్రారంభించలేదు.
త్వరలో
అందుబాటులోకి
మంత్రి దామోదర చొరవతో పనులు పూర్తయిన జహీరాబాద్ సమీకృత మార్కెట్ అందుబాటులోకి రానుంది. ఇటీవల మంత్రి పర్యటనలో భాగంగా సమస్య ఆయన దృష్టికి తీసుకెళ్లగా త్వరలోనే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.
మార్కెట్ల నిర్మాణ పనులు ఏడాదిలోపు పూర్తి చేయాలని గత ప్రభుత్వం నిబంధనలు విధించింది. పబ్లిక్ హెల్త్ అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. టెండర్లు దక్కించుకున్న గుత్తేదారులు తొలుత ఆర్భాటంగా పనులు ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత బిల్లులు రాక చేతులెత్తేశారు.