
శతాధిక వృద్ధురాలి మృతి
మద్దూరు(హుస్నాబాద్): మండలంలోని వల్లంపట్ల గ్రామానికి చెందిన ఆలేటి భూదమ్మ(105) శతాధిక వృద్ధురాలు శనివారం రాత్రి వయోభారంతో మృతి చెందింది. మృతురాలికి ముగ్గురు కుమారులు, కుమారై ఉండగా వీరిలో ఇరువురు కుమారులు మృతి చెందారు. భూదమ్మ నెల రోజుల క్రితం వరకు ఆరోగ్యంగా ఉందని, తన పనులు తానే చేసుకునేదని గ్రామస్తులు తెలిపారు. ఆమె ముని మనవళ్లు, మనవరాళ్లను చూసింది. అంత్యక్రియలు ఆదివారం వ్యవసాయ బావి వద్ద నిర్వహించారు.
విద్యార్థులకు
కొనసాగుతున్న చికిత్స
పుల్‌కల్(అందోల్): సింగూరు గురుకుల పాఠశాలలో ఆరోగ్యశిబిరం కొనసాగుతుంది. మూకుమ్మడిగా విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో మూడు రోజుల నుంచి పుల్‌కల్ ప్రాథమిక కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించి చికిత్స అందించారు. కొందరు విద్యార్థులు కోలుకోగా మరి కొందరికి సైలెన్‌లు ఎక్కిస్తున్నారు. గురుకుల పాఠశాలలోనే క్యాంప్ ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నామని పీహెచ్‌సీ డాక్టర్ సాయికిరణ్ తెలిపారు.
భార్య అదృశ్యంపై ఫిర్యాదు..
పటాన్‌చెరు టౌన్: భార్య అదృశ్యంపై ఓ వ్యక్తిపై అనుమానం ఉందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన చందన్ కుమార్ భార్యతో వచ్చి పటాన్‌చెరు జె.పి కాలనీలో ఉంటూ, ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. అయితే చందన్ భార్య ఖుషి కొన్ని రోజులుగా సౌరబ్ కుమార్ అనే వ్యక్తితో చనువుగా ఉంటుంది. ఈ క్రమంలో ఆగస్టు 12న ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో చందన్ భార్యకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. అనుమానం వచ్చి సౌరవ్ ఉంటున్న ఇంటికి వెళ్లి చూడగా అక్కడ అతనితో ఉంది. దీంతో భార్యని తీసుకొని తన ఇంటికి వచ్చాడు. తిరిగి అదే రోజు అర్ధరాత్రి ఇంటి నుంచి ఖుషి వెళ్లిపోయింది. దీంతో భార్య కోసం వెతికినా ఆచూకీ లభించలేదు. సౌరబ్‌పై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
జహీరాబాద్ టౌన్: పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. జహీరాబాద్ రూరల్ ఎస్‌ఐ.కాశీనాథ్ వివరాల ప్రకారం... మండలంలోని హోతి(బి)గ్రామ శివారులో రేకుల షెడ్‌లో కొంత మంది పేకాట ఆడుతున్నారని వచ్చిన సమాచారం మేరకు దాడి చేశారు. దాడిలో పేకాట ఆడుతున్న 8 మందిని పట్టుకుని, వారి వద్ద రూ. 55,350 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే 8 మొబైల్ ఫోన్లు, 7 మోటారు బైక్‌లను కూడా స్వాధీనం చేసుకుని, సుమోటో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పటాన్‌చెరు డివిజన్‌లో..
పటాన్‌చెరు టౌన్: పేకాట ఆడుతున్న పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ వినాయక్ రెడ్డి, క్రైమ్ సీఐ రాజు వివరాల ప్రకారం... పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని శ్రీరామ్‌నగర్ కాలనీలో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం వచ్చింది. ఈ మేరకు ఆదివారం సాయంత్రం పోలీసులు దాడి చేసి 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.30,400, 11 సెల్‌ఫోన్లు, నాలుగు బైకులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
నలుగురికి గాయాలు
అల్లాదుర్గం(మెదక్): రోడ్డు ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన మండలంలోని 161 జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్‌ఐ శంకర్ వివరాల ప్రకారం... బాన్సువాడ నుంచి హైదరాబాద్ వెళుతున్న కారు అల్లాదుర్గం శివారులో ముందు వెళ్తున్న లారీని వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమదంలో కారులో ప్రయాణిస్తున్న గంగాధర్, స్వరాజ్యలక్ష్మి, శంకర్, సాయిహర్షకు గాయాలయ్యాయి. వీరిని అంబులెన్స్‌లో జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
నర్సాపూర్ రూరల్: పార్క్ చేసిన స్కూటీ అపహరణకు గురైంది. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. నర్సాపూర్ ఎస్సై లింగం కథనం ప్రకారం... మండలానికి చెందిన శక్తి ఆకాశ్ పట్టణంలోని బాలాజీ టిఫిన్ సెంటర్ ఎదుట స్కూటీని పార్క్ చేసి పక్కనే ఉన్న పండ్ల దుకాణానికి వెళ్లొచ్చేసరికి కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

శతాధిక వృద్ధురాలి మృతి

శతాధిక వృద్ధురాలి మృతి