
క్లిక్ చేస్తే.. ఖాతా ఖాళీ
సంగారెడ్డి క్రైమ్: ఇటీవల సైబర్ నేరగాళ్ల దృష్టి గ్రామీణ ప్రజలపై పడింది. ప్రధానంగా వారే లక్ష్యంగా సైబర్ దాడులు జరుగుతున్నాయి. అవగాహన లేకపోవడంతో, అత్యాశతో మరికొందరు సైబర్ వలలో పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. టెలిగ్రామ్ లింకులు, వాట్సాప్ కాల్స్ ద్వారా బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల్లో అవగాహన ఉంటే సైబర్ దాడులను అరికట్టవచ్చని నిపుణులు, సైబర్ అధికారులు సూచిస్తున్నారు.
వివిధ రూపాల్లో..
హైదరాబాద్ వంటి మహా నగరాల్లో అవగాహన రావడంతో సైబర్ నేరగాళ్లు రూటు మార్చారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలను టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల నుంచి పలువురికి పోలీస్ అధికారి డీపీతో కూడిన వాట్సాప్ కాల్స్, టెలిగ్రామ్ లింకులు తరచుగా వస్తున్నాయి. మీ కుమారుడు డ్రగ్ కేసులో ఇరుక్కున్నాడని, తప్పించాలంటే డబ్బులు పంపించాలని డిమాండ్ చేస్తున్నారు. టెలిగ్రామ్ లింకుల నుంచి డబ్బు ఆశ వల వేయడంతో మోసపూరిత లింకులు ఓపెన్ చేసి ఖాతా వివరాలు చెప్పడంతో నష్టపోతున్నారు కొందరు. లింకులు ఓపెన్ చేస్తే అకౌంట్ నుంచి నగదు మాయమవుతుంది. కాగా ఎలాంటి లింకులు ఓపెన్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
కొన్ని ఘటనలు
● ఈ నెల 12న తెల్లాపూర్ మున్సిపాలిటీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన మెసేజ్ వచ్చింది. అందులో తన వివరాలు నమోదు చేశాడు. నిర్వాహకుడు చెప్పిన విధంగా కొద్ది రోజులుగా ఆన్‌లైన్‌లో ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాడు. మొత్తం రూ.49 లక్షల 40 వేలు పెట్టుబడి పెట్టాడు. ఈ క్రమంలో తాను స్టాక్ మార్కెట్‌లో పెట్టిన నగదుతోపాటు లాభాలు ఇవ్వాలని బాధితుడు అడుగగా అపరిచిత వ్యక్తి స్పందించలేదు. మోసపోయినట్లు గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
● గత నెల 29న పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి సైబర్ నేరగాళ్లు టెలిగ్రామ్‌లో లింకు పంపించారు. లింకును ఓపెన్ చేయాలంటే కనీసం రూ.5వేలతో టాస్క్ కంప్లీట్ చేస్తే రెట్టింపు ఆదాయం వస్తుందని ఆశ చూపించారు. అది నమ్మిన బాధితుడు రూ.2లక్షల 50 వేలను పెట్టుబడి పెట్టాడు. వారం తర్వాత డబ్బులు విత్‌డ్రా కాకపోవడంతో కంగుతిన్నాడు. వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఫేక్ కాల్స్ నమ్మొద్దు
అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫేక్ ఫోన్ కాల్స్, లింకులను నమ్మి మోసపోవద్దు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలి. మోసపోయిన గంటలోపు(గోల్డెన్ అవర్)లోపు ఫిర్యాదు చేస్తే బాధితులకు న్యాయం జరిగే అవకాశముంటుంది.
– వేణుగోపాల్ రెడ్డి, డీఎస్పీ, సైబర్ క్రైమ్
ఫేక్ లింకులు పంపుతూ సైబర్ మోసాలు
టెలిగ్రామ్, వాట్సాప్ కాల్స్‌తో బ్లాక్ మెయిల్
అవగాహన లేక మోసపోతున్న ప్రజలు

క్లిక్ చేస్తే.. ఖాతా ఖాళీ