
128 కిలోల ఎండు గంజాయి స్వాధీనం
ఎస్–న్యాబ్, బీడీఎల్ పోలీసుల ఆపరేషన్‌లో పట్టివేత
పటాన్‌చెరు టౌన్: అక్రమంగా తరలిస్తున్న ఎండు గంజాయిని ఎస్–న్యాబ్, బీడీఎల్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన బీడీఎల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాటీ చౌరస్తాలో ఆదివారం ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్–న్యాబ్, బీడీఎల్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో హైదరాబాద్ వైపు నుంచి ముత్తంగి వైపు సర్వీస్ రోడ్డుపై వస్తున్న మహారాష్ట్రకు చెందిన స్విఫ్ట్ డిజైర్, ఒడిశాకు చెందిన బొలెరో వాహనాలను ఆపి తనిఖీ చేయగా అందులో 55 ప్యాకెట్లలో 128 కిలోల గంజాయిని గుర్తించారు. పట్టుబడిన దాని విలువ రూ.64 లక్షలు ఉంటుందని తెలిపారు. గంజాయి తరలిస్తున్న మహారాష్ట్రకు చెందిన ఫిరోజ్ అహ్మద్ , మెహబూబ్ అబ్దుల్ అంసారీ , మహ్మద్ ఇర్ఫాన్‌లతో పాటు ఒడిశాకు చెందిన సగర్ నాయక్ అలియాస్ సగర్ గజపతిలను అదుపులోకి తీసుకుని విచారించారు. ఒడిశాలోని గజపతి జిల్లాలో రాజ్ కుమార్ అనే వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసి మహారాష్ట్ర నాసిక్ జిల్లా.. మలేగావ్ ప్రాంతంలో విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో అంగీకరించారు. పోలీసులు వారి వద్ద నుంచి మొత్తం 128 కిలోల గంజాయి, ఐదు సెల్‌ఫోన్లు రెండు కార్లను సీజ్ చేశారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు. గంజాయి కేసులో కీలకంగా వ్యవహరించిన బీడీఎల్ సీఐ విజయ్ కృష్ణ, ఎస్‌ఐ వెంకటేశం, సంగారెడ్డి జిల్లా ఎస్–న్యాబ్ సీఐ నాగేశ్వర్‌రావు సిబ్బంది, క్లూస్ టీం సిబ్బందిని ఎస్పీ పరితోష్ పంకజ్ అభినందించారు.