
ఎవరి బెదిరింపులకు భయపడం
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
వర్గల్(గజ్వేల్): ఎవరి బెదిరింపులకు భారతీయులు భయపడరని, ప్రజాసంక్షేమం, వారి ఆత్మాభిమానమే ప్రధాని మోదీకి ముఖ్యమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని గౌరారం సమీపంలో గల ఓ ప్రైవేటు పరిశ్రమలో కార్యాలయ విభాగాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... ఇతర దేశాల వ్యవసాయోత్పత్తులు దిగుమతి చేసుకోవాలని కొన్ని దేశాలు చేస్తున్న ఒత్తిడికి తలొగ్గబోమని, ఇలాంటి బెదిరింపులకు బెదరబోమన్నారు. అంతర్జాతీయంగా ఎన్ని ఒత్తిడులు వచ్చినా భారతీయుల సంక్షేమం కోసం మోదీ నిలబడ్డారని స్పష్టం చేశారు. పదేళ్ల క్రితం ధాన్యం కొనుగోలు వ్యయం సుమారు రూ. 3వేల కోట్లు ఉండేదని, ప్రధాని మోదీ అయిన తరువాత ఇప్పుడు సుమారు రూ. 26వేల కోట్లు ఖర్చుపెడుతున్నట్లు స్పష్టం చేశారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కేంద్రం కృషి చేస్తుందని, గడిచిన పదేళ్లలో ధాన్యం కనీస మద్దతు ధరను రూ.1300 నుంచి రూ.2600 పెంచిందని పేర్కొన్నారు. డైరీ ప్రొడక్షన్‌లో భారత్ మొదటి స్థానంలో ఉందన్నారు. సాగులో ఆధునీకత, ఆరోగ్యకర ఉత్పత్తుల కోసం ఎరువుల వాడకం తగ్గించి, నేచురల్ ఫార్మింగ్ వైపు దృష్టి సారించాలన్నారు.