
పెళ్లి చేసుకోవాలని కోరితే..
● ప్రాణం తీసిన ప్రియుడు
● నిందితుడి అరెస్ట్
● వివరాలు వెల్లడించిన సీఐ
కంగ్టి(నారాయణఖేడ్): మహిళను హత్య చేసిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం కేసుకు సంబంధించిన వివరాలు స్టేషన్‌లో సీఐ వెంకట్‌రెడ్డి, ఎస్‌ఐ దుర్గారెడ్డి వెల్లడించారు. మండలంలోని తుర్కవడ్‌గాం గ్రామానికి చెందిన మృతురాలు సింగిదొడ్డి నర్సమ్మ(40) భర్త 15 ఏళ్ల క్రితం మృతి చెందాడు. కాగా మృతురాలితో రాంతీర్థ్ గ్రామానికి చెందిన మేత్రి రాజు(42)కు సంవత్సరం నుంచి వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ క్రమంలో నర్సమ్మ తనను పెళ్లి చేసుకోవాలని తరచూ రాజును డిమాండ్ చేస్తుండేది. గురువారం కంగ్టి, నారాయణఖేడ్ రోడ్డు పక్కన ఉన్న రేకుల షెడ్‌లో ఇద్దరి మధ్య పెళ్లి గురించి గొడవ జరిగింది. అప్పటికే తాగిన మత్తులో ఉన్న రాజు ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలని అనుకున్నాడు. రూంలోకి తీసుకెళ్లి బండరాయితో ఆమె ఛాతీపై, కాళ్లపై కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందింది. నిందితుని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.