
కనీస వేతనాల అమలులో విఫలం
పటాన్‌చెరు టౌన్: కాంటాక్ట్ కార్మికుల కనీస వేతనాల జీవోలను సవరించి, వేతనం రూ. 26 వేలుగా నిర్ణయించి అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్రంలో కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి జరుగుతున్న క్యాంపెయిన్‌లో భాగంగా శనివారం పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతంలోని శాండ్విక్ పరిశ్రమ కాంట్రాక్టు కార్మికులతో క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాములు మాట్లాడుతూ.. 2007 నుంచి రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలు జీవోలను సవరించకపోవడం అత్యంత దారుణమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలు సవరించడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. జిల్లాలో 1700 పరిశ్రమలు ఉన్నాయని, సీఐటీయూ ఆధ్వర్యంలో సర్వేలు నిర్వహించి సమస్యలను గుర్తించి పోరాటం నిర్వహిస్తామన్నారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై ఎక్కడికక్కడ జరిగే పోరాటాల్లో కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పాండు రంగారెడ్డి, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు విష్ణు, గంగాధర్, కార్మికులు పాల్గొన్నారు.
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు