
కల్హేర్‌లో ఇంకా లోటే..
● సాధారణ వర్షపాతం కంటే41 శాతం తక్కువ ● ఐదు మండలాల్లో అధిక, రెండు చోట్ల అత్యధిక వర్షపాతం ● 17 మండలాల్లో సాధారణవర్షపాతం నమోదు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో ఒకవైపు భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ కల్హేర్ మండలంలో వర్షపాతం మాత్రం ఇప్పటికీ లోటులోనే ఉంది. ఇక్కడ సాధారణం కంటే 41 శాతం తక్కువ వర్షం పడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ వర్షాకాలం సీజను ప్రారంభమైనప్పటి నుంచి శనివారం వరకు ఈ మండలంలో సాధారణ వర్షపాతం 432 మి.మీలు కాగా, ఇప్పటి వరకు కేవలం 253 మి.మీల వర్షమే పడింది. జిల్లాలో ఈ ఒక్క మండలంలోనే లోటు వర్షపాతం కొనసాగుతుండటం గమనార్హం. కల్హేర్‌కు సమీపంలో ఉన్న సిర్గాపూర్, నారాయణఖేడ్, నిజాంపేట మండలాల్లో సాధారణ వర్షపాతమే రికార్డు అయింది. కానీ ఈ ఒక్క మండలంలోనే ఈ పరిస్థితి కొనసాగడం గమనార్హం. ఏటా జూన్ మొదటి వారం నుంచి వర్షాకాలం సీజను ప్రారంభమవుతుంది. జూన్ 1 తేదీ నుంచి వర్షపాతాన్ని లెక్కిస్తారు.
పుల్కల్, ఝరాసంగంలో పుష్కలంగా
జిల్లాలో పుల్కల్, ఝరాసంఘం మండలాల్లో అత్యధిక వర్షపాతం రికార్డు అయింది. ఈ రెండు మండలాల్లో సాధారణ వర్షం కంటే వరుసగా 70 శాతం. 61 శాతం అఽధిక వర్షం పడింది. పుల్కల్‌లో ఈ వర్షాకాలం సీజనులో ఇప్పటి వరకు 399 మి.మీల వర్షం సాధారణం కాగా, ఏకంగా 677 మి.మీల వర్షం పడింది. అలాగే ఝరాసంగంలో 380 మి.మీ.లు సాధారణ వర్షపాతం కాగా, ఇక్కడ 613 మి.మీల వర్షం కురిసింది.
ఎనిమిది మండలాల్లో అధిక వర్షం
జిల్లాలో ఎనిమిది మండలాల్లో ఇప్పటి వరకు అధిక వర్షం పడింది. కంగ్టి, నాగల్‌గిద్ద, రాయికోడ్, న్యాల్‌కల్, మునిపల్లి, వట్‌పల్లి, రామచంద్రాపురం, చౌటకూర్ మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ఈ ఎనిమిది చోట్ల సాధరణం కంటే సుమారు 20 శాతం నుంచి 50 శాతం వరకు ఎక్కువ వర్షం కురిసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. సీజను ప్రారంభంలో ఆశించిన మేరకు వర్షాలు కురియకపోవడంతో చాలా మండలాలు లోటులోనే ఉండిపోయాయి. పక్షం రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో లోటు మండలాలు కాస్త సాధారణం, అధిక, అత్యధిక వర్షపాతం నమోదైన మండలాల జాబితాలోకి వచ్చాయి.
17 మండలాల్లో సాధారణ వర్షమే..
జిల్లాలో 32 మండలాలు ఉన్నాయి. శనివారం వరకు 17 మండలాల్లో సాధారణ వర్షపాతమే నమోదైంది. సిర్గాపూర్, నారాయణఖేడ్, మనూర్, జహీరాబాద్, మొగుడంపల్లి, కొహీర్, ఆందోల్, సదాశివపేట, కొండాపూర్, సంగారెడ్డి, హత్నూర, గుమ్మడిదల, జిన్నారం, కంది, పటాన్‌చెరు, అమీన్‌పూర్, నిజాంపేట మండలాల్లో సాధారణ వర్షపాతమే కురిసింది.