
ఆధార్‌లో మార్పుల కోసం వచ్చి..
● పత్రాలు మరిచిపోవడంతో
ఇంటికెళ్లిన కొడుకు
● ఆలస్యం కావడంతో గద్వాల్ అనుకుని గజ్వేల్‌కు వెళ్లిన తండ్రి
● కుటుంబీకులకు క్షేమంగా అప్పగించిన పోలీసులు
గజ్వేల్‌రూరల్: ఆధార్ కార్డులో మార్పుల కోసం హైదరాబాద్‌కు వచ్చిన వ్యక్తి దారి తప్పాడు. గద్వాల్ అనుకుని గజ్వేల్‌కు వెళ్లిన వ్యక్తిని పోలీసులు తిరిగి అతడి కుటుంబీకులకు అప్పగించిన ఘటన శుక్రవారం గజ్వేల్ పట్టణంలో చోటు చేసుకుంది. సీఐ రవికుమార్ వివరాల ప్రకారం... జోగులాంబ–గద్వాల్ జిల్లా ధారూర్ మండలం రాయలపాడు గ్రామానికి చెందిన చిన్న నాగప్ప మూడు రోజుల క్రితం తన కొడుకు తిక్కన్నతో కలిసి ఆధార్‌కార్డులో మార్పులు, చేర్పుల కోసం హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో కాగితాలు మరచిపోయానని, వాటిని తీసుకువచ్చేందుకు ఇంటికి వెళ్తున్నానని తండ్రికి చెప్పి అక్కడే ఉండాలంటూ కొడుకు వెళ్లిపోయాడు. కొడుకు రావడంలో ఆలస్యం కావడంతో గద్వాల్‌కు ఎలా వెళ్లాలంటూ రైల్వేస్టేషన్‌లో ఉన్నవారిని అడగ్గా వారు గజ్వేల్ అనుకుని బస్సు ఎక్కించారు. శుక్రవారం గజ్వేల్‌కు చేరుకున్న నాగప్ప బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతుండగా విధి నిర్వహణలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ జగన్మోహన్‌రెడ్డి, కానిస్టేబుల్ సంతోష్ అతని వివరాలు తెలుసుకున్నారు. వెంటనే కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో వారు గజ్వేల్‌కు చేరుకున్నారు. విచారణ చేపట్టిన అనంతరం నాగప్పను అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా నాగప్ప కుటుంబ సభ్యులు గజ్వేల్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.