
గ్యాస్ లీకై న ప్రమాదంలో..
వారం క్రితం తల్లి.. ఇప్పడు కొడుకు మృతి
ఝరాసంగం(జహీరాబాద్): గ్యాస్ లీకై జరిగిన ప్రమాదంలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు. గ్రామస్తుల కథనం ప్రకారం... ఈ నెల 6న మండల పరిధిలోని ఏడాకులపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై మంటలు చెలరేగి ఇంట్లో ఉన్న తల్లి శంకరమ్మతో పాటు కుమారులు ప్రభుకుమార్, విట్టల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. సుమారు 10 రోజుల పాటు చికిత్స పొందుతూ శుక్రవారం ప్రభుకుమార్(35) మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇదిలా ఉండగా ఈ నెల 8న మృతుడి తల్లి శంకరమ్మ చికిత్స పొందుతూ మృతి చెందింది. తల్లి మరణ వార్త మరువకముందే కుమారుడు మృతి చెందటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్యతో పాటు రెండేళ్ల కుమారుడు ఉన్నారు. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.