
స్వాతంత్య్రం తెచ్చిన ఆనందం
పాపన్నపేట(మెదక్): తన కొడుకు ప్రయోజకుడు కావాలని.. తన కళ్ల ముందే ప్రశంసలు పొందాలని ఏ తండ్రైనా కలలు గంటాడు. తన తండ్రి సమాజంలో ఉన్నతుడిగా నిలవాలని ప్రతి కొడుకు ఆశిస్తాడు. మెదక్‌లో శుక్రవారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ పురస్కారాల వేడుక వారిద్దరి ఆశలను సఫలం చేసింది. పాపన్నపేటకు చెందిన కుకునూరి నరేందర్‌రెడ్డి మెదక్‌లో లైబ్రేరియన్‌గా పనిచేస్తున్నారు. మరో పది నెలల్లో పదవీ విరమణ చేయబోతున్నారు. ఆయన కొడుకు అర్జున్‌రెడ్డి మెదక్ కలెక్టరేట్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన గ్రూప్ 3 పరీక్షల్లో స్టేట్‌టాపర్‌గా నిలిచారు. వారు వృత్తిపరంగా చేస్తున్న సేవలను గుర్తించిన జిల్లా అధికారులు ఆ తండ్రీకొడుకులకు ఉత్తమ ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. ఒకే వేదికపై తండ్రీతనయులు సత్కారం పొందిన తీరు అందరినీ ఆనంద పర్చింది.
ఒకే వేదికపై తండ్రీకొడుకులకు పురస్కారం