
నిండకుండానే గేటు ఎత్తి..
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి/పుల్కల్(అందోల్): సింగూరు ప్రాజెక్టుకు గండి పడే ప్రమాదం పొంచి ఉండటంతో నీటి పారుదల శాఖ ముందుజాగ్రత్త చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ జలాశయం పూర్తిగా నిండకపోయినప్పటికీ వస్తున్న నీటిని వచ్చినట్లే దిగువకు వదిలేస్తున్నారు. ఈ మేరకు బుధవారం సాయంత్రమే ప్రాజెక్టు 11వ గేటును ఎత్తి 10,719 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు రివీట్‌మెంట్ దెబ్బతిన్నదని, మట్టికట్టలు కుంగిపోతున్నాయని డ్యామ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరించిన సంగతి తెలిసిందే. తక్షణ మరమ్మతులు చేపట్టకపోతే ప్రాజెక్టుకు గండి పడి భారీ నష్టం వాటిల్లుతుందని ఈ సంస్థ ఇచ్చిన నివేదికలో పేర్కొంది.
గురువారం సాయంత్రం 6 గంటల సమయానికి 3,868 క్యూసెక్కుల నీరు చేరింది. కానీ 10 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ఇందులో 2,492 క్యూసెక్కులను విద్యుత్ ఉత్పత్తి కోసం విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 29.9 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 21.60 టీఎంసీలే ఉన్నప్పటికీ వచ్చిన నీటిని దిగువకు విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నీటిమట్టం 522 మీటర్లు. అయితే ఈ నీటిమట్టం 517.8 మీటర్లకు పరిమితం చేయాలని ఆశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నీటిమట్టం పెరిగితే డ్యామ్‌కు ప్రమాదం ఉందని డ్యామ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరించింది.
గతేడాది పూర్తిగా నిండాకే..
గతేడాది ఈ ప్రాజెక్టు సెప్టెంబర్‌లో పూర్తిగా నిండింది. సెప్టెంబర్ మొదటి వారంలో ఏకంగా 40 వేల క్యూసెక్కుల వరద రాగా..సెప్టెంబర్ 5న ప్రాజెక్టు నీటిని విద్యుత్ ఉత్పత్తి కోసం విడుదల చేయడం ప్రారంభించారు. అయితే ఈసారి డ్యామ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరికల మేరకు ఆగస్టు రెండో వారంలోనే గేట్లెత్తాల్సిన పరిస్థితి నెలకొంది.
మంజీరా డ్యామ్ నుంచి నీటి విడుదల
సింగూరు గేటు ఎత్తడంతో మంజీరా డ్యామ్ నిండింది. దీంతో ఈ డ్యామ్ గేటు కూడా ఎత్తారు. 10,200 క్యూసెక్కుల నీరు సింగూరు నుంచి రావడంతో అంతేస్థాయిలో దిగువకు వదులుతున్నారు. ఈ డ్యామ్ నుంచి నీటిని కేవలం తాగునీటి అవసరాల కోసమే వినియోగిస్తున్న విషయం తెలిసిందే.
ముందుజాగ్రత్తగా దిగువకు
సింగూరు నీటి విడుదల
వస్తున్న ఇన్‌ఫ్లో వచ్చినట్లే మంజీరాలోకి