
ఆదాయం అదుర్స్
నాలుగు రోజుల్లో రూ.9.07 కోట్ల ఆదాయం ఆర్టీసీకి కాసుల గలగల
నారాయణఖేడ్: రాఖీ పౌర్ణమిని ఆర్టీసీ క్యాష్ చేసుకుంది. ఈ ఏడాది తమ సోదరులకు రాఖీ కట్టేందుకు అక్కాచెల్లెళ్లు ఎక్కువగా ప్రైవేట్ వాహనాల కంటే ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణాలు కొనసాగించారు. ఈ మేరకు ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ సైతం ప్రత్యేక బస్సులు కేటాయించి సొమ్ము చేసుకుంది. ఇలా ప్రతీ పండగ సీజన్‌లో ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపుతూ తమ మార్కును ప్రదర్శిస్తుంది. ఈ రాఖీ పౌర్ణమిని సైతం ప్రత్యేక సర్వీసులు నడిపి భారీగా ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చి ఆదాయం సమకూర్చుకుంది. ఇందులో భాగంగానే ఈనెల 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆర్టీసీ నిత్యం 275 సర్వీసులు నడిపింది. ఈ సర్వీసుల ద్వారా రీజియన్‌లో మహాలక్ష్మి ద్వారా 9.73లక్షలు, ఇతరులు 4.61లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి రూ.9.07కోట్ల ఆదాయం సాధించింది. ఉమ్మడి జిల్లా పరిధిలో 8 డిపోల నుంచి ఈ సర్వీసులు కొనసాగాయి. కార్మికులు తక్కువ ఉన్నా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడపడంతో యాజమాన్యం వెనుకడుగు వేయలేదు. అన్ని డిపోల నుంచి స్పెషల్ సర్వీసులను నడిపింది. ఈ స్పెషల్ సర్వీసులకు రూ.100 చార్జీ వద్ద రూ.50 అదనంగా వసూలు చేశారు. మొత్తం 275 స్పెషల్ సర్వీసులు రీజియన్ పరిధిలో నడిపారు.
సర్వీసులు ఇవే..!
మెదక్ రీజియన్ పరిధిలోని ఆయా డిపోల నుంచి బస్సులను హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రధాన పట్టణాలకు నడిపారు. ఖేడ్ డిపో నుంచి జేబీఎస్, సికింద్రాబాద్, లింగంపల్లి, పటాన్‌చెరు.. జహీరాబాద్ డిపో నుంచి జేబీఎస్, లింగంపల్లి, సంగారెడ్డి క్రాస్‌రోడ్డు.. సంగారెడ్డి డిపో నుంచి జేబీఎస్, సికింద్రాబాద్.. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ నుంచి సికింద్రాబాద్, మెదక్ డిపో నుంచి సికింద్రాబాద్, బాలానగర్ వయా నర్సాపూర్, సిద్దిపేట డిపో నుంచి జేబీఎఎస్, కరీంనగర్, వేములవాడ, దుబ్బాక నుంచి సికింద్రాబాద్, నర్సాపూర్ నుంచి జేబీఎస్, బాలానగర్‌తోపాటు ఇతర పలు ప్రధాన పట్టణాలు, ప్రాంతాలకు సర్వీసులను నడిపారు.
కార్మికులకు భోజన సదుపాయం..
ప్రయాణికుల సౌకర్యార్థం బస్సులు నడిపిన డ్రైవర్, కండక్టర్‌తో పాటు డబుల్ డ్యూటీ చేసిన వారికి సైతం ఖేడ్ డిపోతోపాటు పలు డిపోల్లో భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఖేడ్ డిపో స్వీట్లు, వెజ్ బిర్యానీ పంపిణీ చేసి కార్మికులను ప్రొత్సహించారు. డబుల్ డ్యూటీ నిర్వహించిన డ్రైవర్లకు డ్యూటీ దిగగానే రూ.1,000, కండక్టర్‌కు రూ.650ల చొప్పున డీడీ (డబుల్ డ్యూటీ) అమౌంట్ అందజేశారు. అలాగే కొంతమంది కండక్టర్, డ్రైవర్‌లకు ఇన్‌సెంటీవ్ అందజేశారు.
ప్రయాణికుల సేవకు సిద్ధం
ప్రయాణికులకు సర్వీసు చేసేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. కార్మికులు కూడా ప్రయాణికుల అవసరాల మేరకు విధులు నిర్వర్తించేందుకు సహకరించారు. డబుల్ డ్యూటీలు సైతం నిర్వహిస్తూ సంస్థ మనుగడ కోసం పనిచేశారు. ప్రయాణికులు ఎల్లపుడూ ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలి. కార్మికులకు వెజ్ బిర్యారీ, స్వీట్లు అందించాం.
– మల్లేశయ్య, డీఎం, నారాయణఖేడ్
కార్మికుల సమష్టి కృషి
ఆర్టీసీ సంస్థలో పని చేసే అన్ని వర్గాల కార్మికుల సమష్టి కృషితో రికార్డు ఆదాయం సాధించాం. రీజియన్ పరిధిలో రాఖీ పౌర్ణమి సందర్భంగా నాలుగు రోజులపాటు బస్సులు నడిపాం. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా స్పెషల్ బస్సులు నడుపుతున్నాం. రీజియన్ పరిధిలో రూ.9.07కోట్ల ఆదాయాన్ని పొందగలిగాం. మహాలక్ష్మి ద్వారా సుమారు 9.73లక్షల మంది ప్రయాణించారు. – విజయభాస్కర్, రీజినల్ మేనేజర్, సంగారెడ్డి
ఉమ్మడి మెదక్ జిల్లా డిపోల ఆదాయం వివరాలు
డిపో మహాలక్ష్మి మహాలక్ష్మి నగదు ఆదాయం నగదు చెల్లింపు మొత్తం ఆదాయం మొత్తం
ఆదాయం(రూ.లక్షల్లో) ప్రయాణికులు (రూ.లక్షల్లో) ప్రయాణికులు (రూ.లక్షల్లో) ప్రయాణికులు
దుబ్బాక 44.75 78,221 19.36 24,968 64.11 1,03,189
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ 89.35 1,64,394 43.16 61,436 132.51 2,25,830
మెదక్ 87.09 1,83,324 54.95 79,641 142.04 2,62,965
నారాయణఖేడ్ 51.85 63,089 32.81 35,967 84.66 99056
నర్సాపూర్ 25.73 57,820 11.01 22,607 36.74 80,427
సంగారెడ్డి 85.57 1,69,769 57.29 80,015 142.86 2,49,784
సిద్దిపేట 95.22 1,57,648 75.21 78,094 170.43 2,35,742
జహీరాబాద్ 65.33 98,281 68.37 78,135 133.70 1,76,416
కలిసొచ్చిన వరుస సెలవులు
పెరిగిన ప్రయాణికుల సంఖ్య
రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు