
ఇలా వచ్చి.. అలా వెళ్లాడు
మెదక్ మున్సిపాలిటీ: ఓ కేసులో జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన ఓ వ్యక్తి గంటల వ్యవధిలోనే మరో కేసులో చిక్కుకొని ఇలా వచ్చి.. అలా జైలుకు వెళ్లిన సంఘటన నర్సాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. మద్యం, జూదం వంటి వ్యసనాలకు అలవాటైన మెదక్ జిల్లా హవేళిఘణాపూర్ మండలం మద్దుల్వాయికి చెందిన గజ్జెల భిక్షపతిని తొలిసారి మెదక్ పోలీసులు 2015లో దొంగతనం కేసులో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వివిధ నేరాలకు పాల్పడడంతో సంగారెడ్డి జిల్లా కంది జైలుకు తరలించగా.. ఈనెల 11న విడుదలయ్యాడు. ఈనెల 13న గుమ్మడిదల నుంచి మెదక్ వెళ్తుండగా.. బస్సులో పరిచయమైన మహిళకు మద్యం, చేపలు, డబ్బు ఇస్తానని నమ్మించి నర్సాపూర్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అనంతరం ఆ మహిళకు మద్యం తాగించి రాయితో మోది చెవి రింగులు లాక్కొని పారిపోయాడు.
24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు..
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నర్సాపూర్ సీఐ జాన్‌రెడ్డి దర్యాప్తు చేపట్టారు. పట్టణంలోని ఓ వైన్స్ వద్ద ఆధారాలు సేకరించారు. అనంతరం సమాచారం మేరకు 24గంటల్లోనే గుమ్మడిదలలో భిక్షపతిని అరెస్ట్ చేసి, చోరికి గురైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
జల్సాలకు అలవాటు.. 12 కేసులు
డ్రైవర్‌గా పనిచేసే భిక్షపతి జల్సాలకు అలవాటుపడి చోరీలు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడిపై మెదక్ టౌన్ పీఎస్‌ల(6), సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల(2), హత్నూర(1), నారాయణ్‌ఖేడ్(1), అల్వాల్(1)కేసుతో కలిసి మొత్తం 12 కేసులు ఉన్నట్లు ఎస్పీ వివరించారు. ఈ మేరకు నిందితుడిపై పీడీ యాక్ట్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. అయితే ఈ కేసును 24గంటల్లోనే ఛేదించిన తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్, నర్సాపూర్ సీఐ జాన్‌రెడ్డి, ఎస్‌ఐ లింగం, కానిస్టేబుల్ శ్రీకాంత్‌లను ఎస్పీతోపాటు అడిషనల్ ఎస్పీ మహేందర్‌లు అభినందించి రివార్డులు అందజేశారు.
జైలు నుంచి వచ్చిన గంటల్లోనే మళ్లీ దోపిడీ
24గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు
నిందితుడి రిమాండ్‌కు తరలింపు